తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తమ ఓటమి దిగ్భ్రాంతి నుంచి ఇంకా తేరుకోలేకపోతోంది. నిఖార్సుగా సమీక్షలు చేద్దామని కూర్చుంటే.. వారి కళ్ల ముందు ఈవీఎంలే కనిపిస్తున్నాయి.హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో సమావేశమైన.. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు.. ఎక్కడెక్కడ.. ఎలా ఓడిపోయారన్నది విశ్లేషించుకుంటే.. మొదటగా.. అందరూ చెప్పిన కారణం ఈవీఎంలే. అందుకే… ఈవీఎంల ట్యాంపరింగ్‌పై హైకోర్టుకు వెళ్తాం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా సమావేశం తర్వాత ప్రకటించారు. ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి, అధికార దుర్వినియోగంతో కేసీఆర్ గెలిచారని ఆరోపించారు.
ఓట్ల తొలగింపుపై ఎన్నికల తర్వాత అధికారులు క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. ధర్మపురి, కోదాడ, ఇబ్రహీంపట్నంలో ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని .. ఎన్నికల్లో టీఆర్ఎస్ అక్రమాలపై కమిటీ ఏర్పాటు చేస్తామని కుంతియా స్పష్టం చేశారు. ఎన్నికల అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు దొరికిన కలెక్టర్లపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ధర్మపురి, ఇబ్రహీంపట్నం, కోదాడలో టీఆర్ఎస్ అక్రమంగా గెలిచిందని తేల్చారు. వీవీ ప్యాట్స్ స్లిప్పుల లెక్కింపును సీఈవో ఎందుకు అంగీకరించడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలపై సమావేశంలో చర్చించామని పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై పోరాటం చేస్తామన్నారు ఉత్తమ్.
పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో… అసెంబ్లీ ఎన్నికల షాక్ నుంచే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోలుకోలేకపోతోంది. ఇప్పటికీ… ఏ మాత్రం ఉపయోగం ఉండదని తెలిసినా.. ఈవీఎంల మీద నిందలేసి… తమకు తాము సర్దిచెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టి… ఓ మాదిరి పోటీ అయినా ఇచ్చే ప్రయత్నాలు మాత్రం ఇంకా ప్రారంభించలేదు. కనీసం .. ఆ విషయంపై సమీక్ష కూడా చేయలేకపోతున్నారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకునే పరిస్థితులే టీ కాంగ్రెస్ లో కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.