తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. గాంధీల కుటుంబానికి వీర విధేయుడైన వీహెచ్ లాంటి వాళ్లు పార్టీ వీడతానని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతున్నా… పార్టీని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనంతటికి కారణం.. రాహుల్ కోటరీలోని కొప్పుల రాజేనని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొప్పుల రాజు వైఖరి పై గతంలో రేణుక చౌదరి ఫైర్ అయ్యారు. వీహెచ్ సైతం కొప్పుల పై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ తనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా కొప్పులరాజు అడ్డుపడుతున్నారని అంటున్నారు.
తెలంగాణ కాంగ్రేస్ లో జరుగుతున్న విషయాలు హైకమాండ్‌కు తెలియకుండా ద్వారా పాలకుడిగా కోప్పుల రాజు అడ్డుపడుతున్నాడని సీనియర్ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. కొప్పుల రాజు .. తెలంగాణ రాజకీయాలను పట్టించుకోవడం మానేస్తేనే.. పార్టీ పరిస్థితి మెరుగు పడుతుందని అంటున్నారు. యూత్ కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లో ఎదిగిన పొంగగులేటి సుధాకర్ రెడ్డి లాంటి నేతలు సైతం పార్టీ ని వీడి బీజేపి లోకి వెళ్లారు. ఓ వైపు బీజేపి ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా కాంగ్రేస్ నేతలను టార్గెట్ చేస్తుంటే… కాంగ్రెస్ నేతలు మాత్రం ఉన్న వారిని కూడా కాపాడుకునే ప్రయత్నం చేయడం లేదు.
పాతవారు పోతున్నారు. కొత్త వారు రావడం లేదు. ఎవరైనా పార్టీలో చేరాలని ఆసక్తి ఉన్నా.. అగ్రనేతల తీరుతో.. ప్రత్యామ్నాయ పార్టీని చూసుకుంటున్నారు. సుదీర్ఘ కాలంగా పార్టీలో సీనియర్లంతా.. ఓ సమావేశం ఏర్పాటు చేసుకుని.. తమ అభిప్రాయాన్ని హైకమాండ్‌కు తెలియచేయాలనుకుంటున్నారు. వీరి టార్గెట్.. కొప్పుల రాజే. ఢిల్లీలో తమకు అసలు ఎలాంటి వాయిస్ లేకుండా చేస్తున్నందున.. కొప్పుల రాజునే… రాహుల్ గాంధీ దగ్గర నుంచి తప్పించాలని భావిస్తున్నారు.