తెలంగాణ కాంగ్రెస్ లో చేరేందుకు టీడీపీ, భాజపాలకు చెందిన కొంతమంది నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఈ మధ్య ఈ మాట తెలంగాణ రాజకీయ వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తోంది. అంతేకాదు, కొంతమంది నేతల పేర్లు కూడా బయటకి వచ్చాయి. అధికార పార్టీ నుంచి కూడా కొందరు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నట్టు గుసగుసలు వింటున్నాం. ఈ క్రమంలోనే భాజపా నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్థన రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అయితే, ఆయన ఇటీవల ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసి రావడంతో లైన్ క్లియర్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు. నాగం రాకను కాంగ్రెస్ లో కొంతమంది వ్యతిరేకించడం కూడా జరుగుతోంది. అయితే, ఇప్పుడు టీడీపీకి చెందిన మరో ఇద్దరు ప్రముఖ నేతలకు సంబంధించి కూడా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వారెవరంటే.. కొత్తకోట దయాకర్ రెడ్డి, ఆయన భార్య సీతా దయాకర్ రెడ్డి!
ఈ ఇద్దరూ ఇటీవలే ఢిల్లీ వెళ్లారనీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరుండి మరీ తీసుకెళ్లి రాహుల్ గాంధీతో వీరి చేరికకు ఆమోద ముద్రవేశారనే కథనాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న దేవరకద్ర, మక్తల్ నియజక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో ఈ ఇద్దరూ స్పందించాల్సి వచ్చింది. అసలు విషయం ఏంటంటే.. ఈ ఇద్దరూ ఢిల్లీ వెళ్లిందీ లేదు, రాహుల్ గాంధీని కలిసిందీ లేదు, వీరిని ఉత్తమ్ తీసుకెళ్లిందీ లేదట! మేం ఢిల్లీ వెళ్లి ఏడాదిన్నర దాటిందని ఈ నేతలు అంటున్నారు. అయితే, మరి ఈ కథనాలు ఎందుకొచ్చినట్టు..? ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న మైండ్ గేమ్ లో భాగమా..? అంటే, అవుననే చెప్పాలి.
కాంగ్రెస్ పార్టీలోకి చేరికల్ని పెంచేందుకు రాష్ట్ర నేతలు వ్యూహప్రతివ్యూహాలతో సిద్ధమౌతున్నారు. వీళ్ల టార్గెట్ ఎవరంటే… తెరాసలో చేరేందుకు ఆసక్తి చూపనివారు, ఆ పార్టీకి దూరంగా ఉంటున్నవారు. ఇలాంటి నేతల్ని లక్ష్యంగా చేసుకుని.. ముందుగా వారి చేరికపై లీకులు ఇస్తున్నారట. వారు ఢిల్లీ వెళ్లారనీ, ఉత్తమ్ తోపాటు రాహుల్ ని కలిసి మాట్లాడేశారనీ ఉద్దేశపూర్వకంగానే పుకార్లు పుట్టిస్తున్నట్టు కొంతమంది చెబుతున్నారు. ఇలా పుకార్లను పుట్టించడం ద్వారా సదరు నేతల అనుచరుల్లో చర్చ లేవనెత్తడం.. ఆ తరువాత, వారుతో పార్టీకి చెందిన ఎవరో ఒక నేత టచ్ లోకి వెళ్లడం! ఆ మీటింగ్ ను బహిర్గతం చేసి.. ఫలానా నాయకుడు పార్టీ మారబోతున్నట్టు మీడియాకు ఉప్పందించడం! నాయకుల్ని పార్టీలోకి తెచ్చుకునేందుకు టి. కాంగ్రెస్ ఆడుతున్న మైండ్ గేమ్ ఇదే నట..!