ఆపరేషన్ తెలంగాణకు భాజపా ఎంత ప్రాధాన్యత ఇస్తోందో చూస్తున్నాం. వీలైనంత త్వరగా పెద్ద సంఖ్యలో నాయకుల్ని చేర్చుకునే పనిలోపడింది. దీన్లో భాగంగా ఈనెల 6న కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. ఈ సందర్భంలో పెద్ద సంఖ్యలో నాయకుల్ని పార్టీలో చేర్చుకునే కార్యక్రమానికి రాష్ట్ర నేతలు సిద్ధమౌతున్నారు. దీన్లో భాగంగానే, కాంగ్రెస్ పార్టీకి చెందిన మరికొందరు సీనియర్ నేతలతో భాజపా మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. మొన్నే, హైదరాబాద్ లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో కాంగ్రెస్ కి చెందిన నలుగురు కీలక నేతలు రామ్ మాధవ్ ను కలిసినట్టుగా ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా రామ్ మాధవ్ వారిని భాజపాలోకి ఆహ్వానించారనీ, వారు సానుకూలంగా స్పందించారని సమాచారం.
మాజీ మంత్రి, సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డితో భాజపా నేతలు చర్చించారని సమాచారం. మరో సీనియర్ నేత ముఖేష్ గౌడ్ కూడా భాజపాలో చేరేందుకు అంతా సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలూ భాజపా అధినాయకత్వంతో చర్చలు జరిపారని వినిపిస్తోంది. మరో మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ భార్య పద్మిని కూడా కాషాయ కండువా కప్పుబోతున్నారు. నిజానికి, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈమె భాజపాలో చేరారు. కాకపోతే, ఒక్కరోజులోనే తిరిగి మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చేశారు. ఇప్పుడు మళ్లీ పూర్తిస్థాయిలో భాజపాలో చేరబోతున్నారు.
భాజపా టార్గెట్ ఏంటంటే.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఓడిపోయిన నేతలు, పార్టీలో ప్రస్తుతం ప్రాధాన్యత లేని సీనియర్లు, గతంలో కీలకంగా వ్యవహరించినవారిని పార్టీలో చేర్చుకోవడం. మరో ఐదు రోజుల్లోగా, అంటే అమిత్ షా ఇక్కడికి వచ్చేలోగా ఈ చర్చల కార్యక్రమాలు ముగించుకుని… సాధ్యమైనంత ఎక్కువమందిని ఆయన సమక్షంలో పార్టీలో చేర్పించే పనిలో నేతలు బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మరింత బలహీనపడిందనే సంకేతాలు ఇవ్వడంతో భాజపాకి బలం పెరుగుతుందనేది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. తెరాసకు తామే ప్రత్యామ్నాయం అనే ఫీలింగ్ ఇప్పట్నుంచే ప్రజల్లోకి బలంగా కలిగించాలనే ఉద్దేశంతో ఉన్నారు. అమిత్ షా సమక్షంలో పార్టీ చేరే వారి జాబితాలో కొందరు టీడీపీ నేతలు కూడా ఉన్నట్టు సమాచారం.