తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పెద్ద సవాల్. అసెంబ్లీలో ఘోర పరాజయం మూటగట్టుకున్న పార్టీ, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటుకోవాల్సిన అవసరం ఉంది. కానీ, ఇలాంటి సమయంలో కూడా పార్టీ నాయకుల మధ్య ఐక్యత కొరవడుతోంది! నాయకుల మధ్య నమ్మకాలు ఉండటం లేదు. రాష్ట్ర నాయకత్వం మీద నాయకులకు, నాయకుల తీరు మీద పీసీసీకి విశ్వాసం లేని పరిస్థితి కనిపిస్తోంది! ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నవారంతా పార్టీలో కొనసాగుతారా లేదా అన్నట్టుగా కనిపిస్తోంది..! ఉన్నవారిలో తెరాసలో చేరేందుకు సిద్ధంగా ఉన్నదెవరు అనే చర్చ ఇప్పుడు టీ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది.
రేగా కాంతారావు, ఆత్రం సక్కు… ఈ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కండువా మార్చుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఇద్దరూ సొంత పార్టీ తీరుపై గడచిన కొద్దిరోజులుగా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అయితే, పార్టీ మారుతున్నట్టు ప్రకటించకపోయినా… సొంత పార్టీపై దాడికి దిగుతుండటంతో అనుమానాలు బలపడ్డాయి. ఇదే సమయంలో మరో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ మరో ప్రచారం ఇప్పుడు తెరమీదికి వచ్చింది..! ఆ నలుగురు ఎవరనే చర్చ ఇప్పుడు తీవ్రంగా జరుగుతోంది. ఖమ్మం జిల్లాకి చెందిన నేతలు సిద్ధంగా ఉన్నారని కొందరు అంటుంటే, నల్గొండ నుంచి ఒక కీలక నేత కాంగ్రెస్ నుంచి బయటకి వచ్చేందుకు సిద్ధమౌతున్నారంటూ మరికొందరు చర్చించుకుంటున్న పరిస్థితి.
నాయకుల తీరుపై ఇలాంటి అనుమానాలు వినిపిస్తున్నప్పుడు… వారిని పీసీసీ నేరుగా పిలిచి మాట్లాడే ప్రయత్నం చెయ్యొచ్చు. అయితే, అలాంటి ప్రయత్నం ఉత్తమ్ కుమార్ రెడ్డి చేశారే అనుకోండి… దాన్నే సాకుగా చూపించి, మమ్మల్ని అవమానిస్తున్నారంటూ పార్టీ నుంచి బయటకి వెళ్లిపోతారేమో అనేది పీసీసీ నాయకత్వం టెన్షన్ గా తెలుస్తోంది. అలాగని ఉపేక్షిస్తూ పోతుంటే… లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పార్టీలో ఐక్యత దెబ్బతినే పరిస్థితి. దీంతో సొంత పార్టీలోని తెరాస కోవర్టును గుర్తించడమే ఇప్పుడో కొత్త సమస్యగా మారిందని కాంగ్రెస్ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. పీసీసీ నాయకత్వం మారాలంటూ ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి నేతలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఇలాంటప్పుడు, పార్టీ కోవర్టులను గుర్తించే పని మొదలుపెడితే… పీసీసీకి మరిన్ని చిక్కులు తప్పవు కదా.