తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమయ్యారు. సంగారెడ్డి వరకూ మెట్రోను పొడిగించాలని విజ్ఞప్తి చేసేందుకు… సంగారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై విజ్ఞాపనులు చేసేందుకు సీఎంను కలిశానని.. జగ్గారెడ్డి చెబుతున్నారు. తానేమీ చీకట్లో కేసీఆర్ ను కలవలేదని చెబుతున్నారు. అభివృద్ధి పనుల కోసం ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిస్తే తప్పు లేనిది ఎమ్మెల్యేగా తాను సీఎంను కలిస్తే తప్పేమిటని ఆయన వాదిస్తున్నారు.
ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి అమిత్ షా, మోదీలతో పలుమార్లు సమావేశం అయ్యారు. అది తప్పు కానీ సీఎంగా ఉన్న కేసీఆర్ కలవడం తప్పేమిటన్న లాజిక్ ను ఆయన వినిపిస్తున్నారు. కోమటిరెడ్డి కూడా బీజేపీలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకునేందుకే ప్రధానిని కలిశారన్న గుసగుసలున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో లైన్ క్లియర్ అయితే.. సంగారెడ్డి టిక్కెట్ ను కేసీఆర్ ఆఫర్ చేస్తే జగ్గారెడ్డి పార్టీ మారిపోవచ్చన్న గుసగుసలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
జగ్గారెడ్డి మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయింది టీఆర్ఎస్ పార్టీ నుంచే. తర్వాత ఆయన పార్టీతో విభేదించి కాంగ్రెస్లో చేరారు. వైఎస్ టైంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత ఓ సారి బీజేపీలో చేరినా మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరుకున్నారు. కాంగ్రెస్లో ఆయన ఇమడలేకపోతున్నారని ఇటీవలి కాలంలో ప్రచారం జరుగుతోంది. కానీ ఆయనను ఆహ్వానించే పార్టీ లేదు. బీజేపీలో చేరలేరు. బీఆర్ఎస్లో చేరేందుకు స్థానిక నేతలు అడ్డం పడతారు. ఇలాంటి పరిణామాలతో జగ్గారెడ్డికి పార్టీ మారే చాన్స్ లేదన్న అభిప్రాయం ఉంది. అయితే ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం కేసీఆర్తో సమావేశం కావడం.. అందులో తప్పేముందని సమర్థించుకోవడంతో ఆయనపై మరోసారి పార్టీ మార్పు చర్చలు ప్రారంభమయ్యయి.