తెలంగాణ నుంచి మేము వస్తే మమ్మల్ని పట్టించుకోరా అని కాంగ్రెస్కు చెందిన ఓ ఎమ్మెల్సీ, ఓ ఎమ్మెల్యే టీటీడీపై మండిపడ్డారు. వారికి ప్రోటోకాల్ ప్రకారం గౌరవ మర్యాదలు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. తమ సిఫారసు లేఖలు తీసుకోవాలని దర్శన టిక్కెట్లు, గదులు ఇవ్వాలని వారంటున్నారు. లేకపోతే తాము కూడా సీరియస్ గా ఆలోచించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏపీ ఎమ్మెల్యేలు భద్రాచలం, యాదాద్రి వచ్చినప్పుడు ప్రోటోకాల్ దర్శనాలు కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు.
తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏం కోరుకుంటున్నారో సులువుగా అర్థం చేసుకోవచ్చు. గతంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిఫారసు లేఖల మీద టిక్కెట్లు కేటాయించుకుని అమ్ముకునేవారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు నేరుగా వచ్చే వీఐపీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. సిఫారసు లేఖలతో టిక్కెట్లు తీసుకునే వారి విషయంలో పూర్తి స్థాయి పరిశీలనచేస్తున్నారు. తెలంగాణ నుంచి ఎమ్మెల్యేలు ఇచ్చే సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకుంటున్నారో లేదో స్పష్టత లేదు.
కానీ నేరుగా వచ్చే ఎమ్మెల్యేలకు మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏపీ ఎమ్మెల్యేలకు మాదిరిగానే ప్రోటోకాల్ ఇస్తున్నారు. కానీ వీరు అంతకు మించి గౌరవం కోరుకుంటున్నారని సులువుగానే అర్థం అవుతుంది. ప్రస్తుతం టీటీడీకి పాలకమండలి లేదు. పాలకమండలి ఏర్పాటు తర్వాత తెలంగాణ నుంచి కూడా ఒకరిద్దరికి అవకాశం లభించవచ్చు. అప్పుడు వీరి సమస్యలను పరిష్కరించవచ్చు.