తెలంగణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ లాభం భారీగా తెచ్చి పెట్టే నినాదాన్ని అందిపుచ్చుకుంది. అదే ఎల్ఆర్ఎస్. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల రెవిన్యూ సంస్కరణలు తీసుకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన లేఔట్ రెగ్యూలేషన్ స్కీమ్‌ను ప్రకటించారు. దీని ప్రకారం… ప్రతీ ఖాళీ స్థలం.. ఇంటి స్థలం.. ఇలా ఏ ఆస్తి ఉన్నా.. ప్రతీ ఒక్కరూ అదనంగా పన్ను కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా.. రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. అనేక నిబంధనలు పెట్టి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజల్లో ఓ భావన పెరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని పక్కాగా ఉపయోగించుకుంటోంది. ప్రజలకు భరోసా ఇస్తోంది. తెలంగాణ ప్రజలు ఎవరూ ఎల్ఆర్ఎస్ కట్టొద్దని .. పార్టీ తరపున పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచితంగా ప్లాట్లను క్రమబద్దీకరిస్తామని ప్రకటించేశారు.
ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి మూడు లక్షల కోట్లను పిండుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు లెక్కలు చెబుతున్నారు. ప్రజలను ప్రభుత్వం దోచుకుంటోందని కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేస్తున్నారు. ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఎల్ఆర్ఎస్ అంశం ఇప్పుడు.. తెలంగాణలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత కారణంగా… ప్రభుత్వం కూడా.. పదే పదే వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. పేదల వద్ద నుంచి డబ్బు వసూలు చేయడం కోసం ఈ పథకం ప్రవేశ పెట్టలేదని.. రికార్డులన్నీ సక్రమంగా ఉంచేందుకే చేస్తున్నామని వాదిస్తున్నారు. ఈ విషయంలో ఫీజు తగ్గిస్తున్నామని ఓ సారి ప్రభుత్వం ప్రకటన చేసింది.
కానీ అసలు లే ఔట్లకు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వమే అయినప్పుడు మళ్లీ అక్రమం అని చెప్పి ఫీజులు కట్టాలనడం ఏమిటన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో పడింది. సాధారణంగా ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు… రుణాలు కట్టొద్దని… పన్నులు చెల్లించొద్దని.. తామొస్తే మాఫీ చేస్తామని ప్రకటనలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు.. కాంగ్రెస్‌కు ముందుగానే ఓ అస్త్రం దొరికింది. తెలంగాణ ప్రజల్లో ఉన్న అసంతృప్తి వారికి బలంగా మారే అవకాశం ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.