తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ రెండు సమస్యలున్నాయి. ఒకటీ… ఇతర పార్టీల నుంచి ఎదుర్కొనే సమస్యలైతే, రెండోది.. సొంత పార్టీలో నాయకులు సృష్టించుకునే సమస్యలు! రాష్ట్రంలో ఇప్పుడు మొదటి రకం సమస్యలను పార్టీ తీవ్రంగా ఎదుర్కొంటోంది. గెలిచిన కొద్దిమంది ఎమ్మెల్యేలలో కొందరు తెరాస గూటికి చేరిపోయారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా పోయింది. వరుసగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయింది. త్వరలో మున్సిపల్ ఎన్నికలున్నాయి. ఇన్ని సమస్యలూ సవాళ్లూ ఎదురుగా ఉంటే… అబ్బే, మీకు ఇవన్నీ చాలవన్నట్టుగా పార్టీలో మరో కుంపటి రాజేస్తున్నారు కొంతమంది సీనియర్లు. విధేయుల ఫోరమ్ అంటూ కొత్తగా ఒకటి స్థాపించారు. సీనియర్ నేతలు వీ హన్మంతరావు, మర్రి శశిధర్ రెడ్డి. శ్యామ్ మోహన్, చంద్రశేఖర్, నిరంజన్ రెడ్డి, కోదండరెడ్డి… ఇలా కొంతమంది కలిసి ఒక ఫోరమ్ పెట్టారు.
ఈ ఫోరమ్ తరఫున సోనియా గాంధీకి ఓ లేఖ రాశారు. దాని సారాంశం ఏంటంటే… తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు గుర్తింపు లేకుండా పోయిందనీ, అనుభవజ్ఞులకు అవకాశాలు పెంచితేనే రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవం వస్తుందని అభిప్రాయపడ్డారు. పీసీసీ కొత్త అధ్యక్షుడిని నియమించేముందు, ఇక్కడున్న సీనియర్లను పరిగణనలోకి తీసుకుని, తమలో ఒకరికి అవకాశం కల్పించాలని సోనియాని లేఖ ద్వారా కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలంటే పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత పెంచాలన్నారు. కేడర్ నిరాశలో ఉందనీ, వారిలో ధైర్యం పెరగాలంటే సీనియర్లకు, పార్టీని ఎప్పట్నుంచో నమ్ముకున్నవారికి గుర్తింపు ఉండాలన్నారు.
ఒక్కమాటలో చెప్పాలంటే… పీసీసీ కొత్త అధ్యక్ష పదవిని సీనియర్లకే ఇవ్వాలనేది వీరి డిమాండ్. దీంతోపాటు, పార్టీలో కొత్తగా చేరిన నేతలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉందనేదీ వీరి అక్కసు అనాలి! అయినా, తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్న పరిస్థితిలో సీనియర్లు ఎలా వ్యవహరించాలి..? ముందుగా పార్టీని గాడినపెట్టే ప్రయత్నాలు చెయ్యాలి. అందర్నీ కలుపుకుని ప్రజల్లోకి సమష్టిగా వెళ్లాలి. వారి సీనియారిటీని ఉపయోగించి పార్టీని ప్రజలకు దగ్గర చేస్తే… ఆ తరువాత, పదవుల గురించి మాట్లాడుకోవచ్చు. క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికే ప్రమాదంలో పడుతూ ఉంటే… తమకు పదవులు దక్కడం లేదనీ, ప్రాధాన్యత పెంచితేనే క్రియాశీలంగా పనిచేస్తామన్నట్టుగా కండిషన్లు పెట్టి వ్యవహరించడం ఎంతవరకూ సరైందో వారికే తెలియాలి. ఇంకోటి… ఈ ఫోరమ్ పెట్టడం వల్ల, పార్టీలో కొత్తగా చేరినవారంతా ఒక గ్రూపు, ఎప్పట్నుంచో ఉన్నవారంతా ఒక గ్రూపు అనే విభజన రేఖను గీస్తున్నట్టుగా ఉంది. విధేయులంటూ కొత్తగా ఉంటారా, పార్టీలో ఉన్నవారంతా ఉన్నంతకాలమూ విధేయులుగానే చూడాలి కదా!