కాంగ్రెస్ పార్టీకి గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీలు బోనస్ గా లభించాయి. గతంలో కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ లను కేసీఆర్ సిఫారసు చేశారు. కానీ గవర్నర్ ఆమోదించలేదు. కానీ తర్వాత మరో పేర్లను కానీ.. వారి పేర్లను కానీ గవర్నర్కు పంపలేదు. దీంతో ఆ రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు వాటిని భర్తీ చేసుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లభించింది.
ఎవరికైనా ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రి పదవుల్లోకి తీసుకోవాలనుకుంటే రేవంత్ రెడ్డి ఈ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా పదవి ఇచ్చే అవకాశం ఉంది. పదేళ్లుగా కాంగ్రెస్ నేతలకు పదవులు లేక ఇబ్బంది పడుతున్నారు. పార్టీనే నమ్ముకున్న వారికి రేవంత్ ఆ రెండు సీట్లను ఇచ్చే అవకాశం ఉంది. మంత్రి పదవుల విషయంలో ఇంకా ఎలాంటి చర్చలు లేకపోయినప్పటికీ… కోదండరాంను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా కాంగ్రెస్ లో జరుగుతోంది.
కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను గవర్నర్ ఆమోదించినట్లయితే ఎమ్మెల్సీలుగా ఆరేళ్లు ఉండేవారు. కానీ ఇప్పుడు వారికి మళ్లీ చాన్స్ రాదు. రాజకీయాల్లో దాసోజు శ్రవణ్ అత్యంత దురదృష్టవంతునిగా మారారు. ఏఐసీసీలో స్పోక్స్ పర్సన్ గా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదనుకుని బీజేపీలో చేరారు. అక్కడ్నుంచి మునుగోడు ఉపఎన్నికల సమయంలో బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయింది. ఆయనకు ఏ పదవి దక్కే అవకాశం లేకుండా పోయింది.