తెలంగాణ ప్రభుత్వం యువత తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్నది బహిరంగరహస్యం. ఉద్యమంలో వారే కీలకం. నీళ్లు, నిధులు, నియామకాల్లో.. మిగిలిన రెండింటి సంగతి పక్కన పెడితే నియామకాల్లో మాత్రం యువతకు న్యాయం జరగలేదు. పదేళ్లలో ఒక్క గ్రూప్స్ నోటిఫికేషన్ ఇచ్చారు. అదీ కూడా లీకేజీలతో మూలనపడింది. ఇలాంటి పరిస్థితుల్లో వారి అసంతృప్తిని ఓట్లుగా మల్చుకునేందుకు కాంగ్రెస్ సరైన ప్రణాళిక వేసింది. మేనిఫెస్టోలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటించింది.
అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండ్ వేస్తామని చెప్పడం కాదు.. ఏ తేదీన ఏ నోటిఫికేషన్ ఇస్తామో కూడా జాబ్ క్యాలెండ్ లో కాంగ్రెస్ వివరించింది. ఇది నిరుద్యోగ యువతను విశేషంగా ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ పార్టీ రేసులో లేకపోతే ఈ మేనిఫెస్టో, జాబ్ క్యాలెండర్ ను పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ.. ప్రస్తుతం హోరాహోరీ పోరు సాగుతోందన్న అభిప్రాయం వినిపిస్తున్న సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టో, జాబ్ క్యాలెండర్… యువతను ఏకపక్షంగా కాంగ్రెస్ వైపు మొగ్గేలా చేసే అవకాశాలు ఉన్నాయి.
బీఆర్ఎస్ పార్టీ నియామకాల విషయంలో పారదర్శకంగా లేదు. పరీక్షలు పెట్టినా కష్టపడిన వారికి వస్తాయన్న నమ్మకం లేనట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇంత జరిగినా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయకపోవడమే దీనికి కారణం. మొత్తంగా.. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువత ఓట్లను ఏకపక్షంగా పొందడానికి మేనిఫెస్టోలో మంచి ప్లానే వేసిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.