ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో చేసిన కామెంట్లకు వివరణ ఇవ్వాలని జారీ చేసిన షోకాజ్ నోటీసులకు ఎలాంటి వివరణ రాలేదని..స్పందించలేదని అందుకే సస్పెండ్ చేస్తున్నామని చిన్నారెడ్డి పేరుతో జారీ అయిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉపఎన్నికల్లో గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో వచ్చిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచారు. అయితే గెలిచిన కొద్ది రోజులకే ఆయన కాంగ్రెస్ పార్టీకి ఏకు మేకయ్యారు. ఎంతగా అంటే ఆయన ప్రతి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. బీఆర్ఎస్ కన్నా ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో కులగణనను కూడా తప్పు పట్టారు. రాహుల్ సూచనల మేరకు కులగణన చేశామని రేవంత్ చెబుతూంటే మల్లన్న మాత్రం అది తప్పుల తడక అని. . ఇతర పార్టీల వాదనకు ప్రాధాన్యం ఇచ్చేలా మాట్లాడారు. అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. రెడ్డి సామాజికవర్గాన్ని ఘోరంగా తిడుతున్నారు. ఆయన తన వ్యాఖ్యలపై ఏ మాత్రం చింతించే పరిస్థితి లేకపోవడంతో పాటు .. సొంతంగా ఆయన రాజకీయంగా ఎదిగేందుకు సమావేశాలు పెట్టుకుంటూండటంతో ఆయనను సస్పెండ్ చేయడమే మంచిదని కాంగ్రెస్ నిర్ణయించుకుంది.