తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించే నాయకుడి కోసం.. ఆ పార్టీ అధినాయకత్వం వెదుకులాడుతోంది. ఆ సామర్థ్యం ఉన్న వాళ్లు కొంత మంది ఉన్నప్పటికీ… వారి ఊగిసలాట ధోరణి… హైకమాండ్‌ను ఇబ్బది పెడుతోంది. పీసీసీ చీఫ్ గా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవి కాలం ఇప్పటికే ముగిసింది. దీనికి తోడు దేశ వ్యాప్తంగా పార్టీని ప్రక్షాళన చేయడానికి రాహుల్ రెడీ అయ్యారు. దీంతో కచ్చితంగా కొత్త నాయకత్వం వస్తుందని ఖరారయింది.
తెలంగాణలో బలమైన సామాజిక వర్గం రెడ్డి. కాంగ్రెస్ కి ఈ వర్గమే కీలకం. ప్రస్తుతం అదే సామాజిక వర్గం నేత పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆ వర్గానికి పీసీసీ పీఠం అందించే అవకాశం ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్, రేవంత్ రెడ్డి రేసులో ఉన్నారు. ఇద్దరిలో ఎవరికి పదవి ఇచ్చినా.. రెండో వ్యక్తి పార్టీ మారతాడనే వాదన గాంధీభవన్‌లో గట్టిగానే వినిపిస్తోంది. రేవంత్ రెడ్డికి ఆ ఛాన్స్ దక్కకుండా పార్టీలోని ఓ వర్గం ఢిల్లీ స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కి అవకాశం ఇవ్వాలనే లాబీయింగ్ జరుగుతోంది.
సాధారణంగా పీసీసీ అధ్యక్ష పీఠం రెండేళ్లకే ఉంటుంది. ఎప్పటికప్పుడు పొడిగింపు లభిస్తుంది. అందుకే రేవంత్‌కు ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా అవకాశం ఇవ్వొచ్చని కొంత మంది మధ్యేమార్గాన్ని ప్రతిపాదిస్తున్నారు. అయితే కొద్ది కాలానికి పదవి తీసుకుని..తీరా ఎన్నికల నాటికి తప్పుకోమంటే కోమటిరెడ్డి అంగీకరించే అవకాశం లేదు. పార్టీలో అప్పటికే పట్టు పెంచుకుంటారు కాబట్టి… చేయగలిగిన నష్టం చేస్తారు. ఇప్పుడే రేవంత్ కి ఆ చాన్స్ ఇస్తే.. బీజేపీలో చేరిపోవడం కాయం కావొచ్చు. అయితే మధ్యే మార్గంగా హైకమాండ్ కొత్త ఆలోచన చేస్తుందిఅని చెబుతున్నారు. రెడ్ల పంచాయతి తలనొప్పిగా మారే అవకాశం ఉంది కాబట్టిమాజీమంత్రి శ్రీధర్ బాబుకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనే చర్చ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక వర్గం శ్రీధర్ బాబుకు గట్టిగా సపోర్ట్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉత్తమ్ మద్దతు కూడా శ్రీధర్ బాబుకు ఉంది.