ప్రజాకూటమి .. ప్రత్యేకంగా కామన్ మినిమం ప్రోగ్రాంను విడుదల చేసింది. అయినప్పటికీ.. కూటమిలోని పార్టీలన్నీ విడివిడిగా మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. గతంలో టీడీపీ విడుదల చేయగా..ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా… తమ ప్రజామేనిఫెస్టోను ప్రకటించింది. 37 అంశాలతో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించారు. రైతులకు ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీ , ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ కాంగ్రెస్ హామీల్లో తురుపుముక్కగా ఉన్నాయి. ‘జయజయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చడం, రాష్ట్ర కోడ్ ‘టీఎస్’ను ‘టీజీ’గా మార్పు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారులపై మూడు నెలల్లో కేసులన్నీ ఎత్తివేస్తామని ప్రకటించారు. రైతు బంధు పథకం.. కౌలు రైతులకు వర్తింప చేయడం, పంటలకు మద్దతు ధర కోసం రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో ఎన్ఆర్ఐ పాలసీ రూపొందించడం, గల్ఫ్ కార్మికుల కోసం ఏటా రూ.500కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రధానంగా హామీ ఇచ్చింది.
యువతకు రూ.3వేల నిరుద్యోగ భృతి, మైనార్టీలకు సబ్‌ప్లాన్ అమలు చేస్తామని ప్రకటించారు. ఉద్యమకారుల కోసం అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థికసాయం, ఉచిత బస్‌పాస్ సౌకర్యం, డబుల్బెడ్రూం ఇల్లు ఇచ్చేలా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందు పరిచారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పక్కాగా అమలు చేస్తామని ..ఏడాదిలో 20వేల పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహిస్తామన్నారు. జర్నలిస్టులకు రూ. 200 కోట్లతో సంక్షేమ నిధి, జర్నలిస్టులకు ఇళ్లు, హెల్త్‌కార్డులు వంటి హామీ ఇచ్చారు. సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తింపు, ఆదివాసీ కార్పొరేషన్ ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు. మైనార్టీలకు సబ్‌ప్లాన్, వక్ఫ్‌బోర్డుకు జ్యుడిషియల్ అధికారాలుబీసీ సబ్‌ప్లాన్, బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల హామీ కూడా ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం తొలగించిన 26 కులాలను బీసీల్లో చేరుస్తామన్నారు. మహిళా సంఘాలకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, కుటుంబానికి ఉచితంగా ఆరు గ్యాస్ సిలిండర్లును కూడా కాంగ్రెస్ వరాలుగా ప్రకటించింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు మార్చి.. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌గా పెడతామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. తుమ్మడి హట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తాం కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగులకు కొన్ని ఆకర్షణీయమైన హామీలు ఇచ్చారు. సీపీఎస్ విధానం రద్దు చేస్తాం, కొత్త పీఆర్సీ అమలు ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెంచుతామన్నారు. సింగరేణి నియామకాల్లో అవకతవకలపై విచారణ జరిపిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన భారీ మేనిఫెస్టోలో.. ఏ వర్గాన్నీ నిరాశపర్చలేదు. అందరికీ.. లాభం కలిగించేలా.. వరాలు ప్రకటించారు.