కాంగ్రెస్ అగ్రనేతలంతా.. ఈ ఎన్నికల ద్వారా వారసులతో రాజకీయ ఆరంగేట్రం చేయించాలని తాపత్రయ పడుతున్నారు. వారసులు రాజకీయ రంగ ప్రవేశానికి ఉబలాట పడుతూ ఉండటంతో.. వారికి శుభారంభం ఇచ్చేందుకు… సీనియర్ నేతలు… తంటాలు పడుతున్నారు. ముందుగా టిక్కెట్లు ఇప్పించుకోవడమే వారికి తలకు మించిన భారంగా మారబోతోంది. తమ వారసులకు టికెట్లు ఇప్పించుకోవడానికి జానారెడ్డి లాంటి సీనియర్ నాయకుడు కూడా.. కుమారుడ్ని తీసుకుని ఢిల్లీలో మకాం పెట్టారు. తన రాజకీయ జీవితం ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు టికెట్ కోసం.. పైరవీ చేసుకునే పరిస్థితి రాలేదని జానారెడ్డి చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన ఢిల్లీలో మకాం వేశారు. కాకపోతే తన టిక్కెట్ కోసం కాదు.. కుమారుడు రఘువీర్ కోసం.
జానారెడ్డి కుమారుడు రఘు వీర్ ఎన్నికల బరిలో దిగాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఆయన మిర్యాలగూడ లో ప్రచారాన్ని సైతం ప్రారంభించారు. మిర్యాలగూడలో జానారెడ్డికి ఉన్న పలుకుబడితో.. రఘువీర్‌కు టికెట్ రావడం ఖాయమన్న ప్రచారం జరిగింది. కానీ ఒక కుటుంబానికి ఒకే టికెట్ అంటూ పార్టీలో నేతలు కొత్త వాదనలు కాంగ్రెస్ పార్టీలో తెర మీదకు వచ్చాయి. దీంతో కంగారు పడిన జానారెడ్డి ఢిల్లీ వెళ్లారు. హైకమాండ్ పెద్దలతో చర్చలు ప్రారంభించారు. నల్లగొండ జిల్లాలో కుటుంబాలకు కుటుంబాలే టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి తాజా మాజీ ఎమ్మెల్యేలు. హుజూర్ నగర్, కోదాడ టిక్కెట్లు వారికే దక్కుతాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ నుంచి బరిలోకి దిగుతారు. మునుగోడు టిక్కెట్ కోసం రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ప్రత్యేకమైనా దారిలో ముందుకెళ్తున్నారు. మరో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనతో పాటు తన కొడుకు సర్వోత్తమ్ రెడ్డికి కూడా టికెట్ కోరుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో చాలామంది నేతలది ఇప్పుడు అదే పరిస్థితి. మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డి రాజేంద్రనగర్ లో ప్రచారం మొదలు పెట్టారు. అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ యాదవ్, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ముషీరాబాద్ నుంచి పోటీకి పావులు కదుపుతున్నారు. ఇక మాజీ మంత్రి డీకే అరుణ సైతం తన కుమార్తెను ఎన్నికల బరిలో దించాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారు. సిగ్ధారెడ్డికి మక్తల్ టిక్కెట్ ను ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా నేతలంతా ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. వారసులందర్నీ రంగంలోకి దింపితే.. అది కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిణామమే అవుతుందన్న అంచనాలున్నాయి.