తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ను టార్గెట్ చేస్తున్నారా? ఆమె కారణంగా పార్టీలో తమ పరపతి తగ్గుతోందని భావిస్తున్నారా? ప్రభుత్వంలో ఆమె జోక్యాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. మొన్నటివరకు ఆమెను ఆకాశానికి ఎత్తేసిన నేతలు..ఇప్పుడు మీనాక్షి పద్ధతి ఏం బాగోలేదని పెదవి విరుస్తున్నారు. అంతేకాదు.. ఆమె విషయంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్కు కోరస్ పాడుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ను సెట్ రైట్ చేసేందుకు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గా రాహుల్ టీమ్ లో కీలకంగా ఉన్న మీనాక్షి నటరాజన్ ను అపాయింట్ చేశారు. అధికారంలోకి వచ్చాక ఇద్దర్ని మార్చి..లాయల్ గా పనిచేసే మీనాక్షికి బాధ్యతలు కట్టబెట్టారు. దీంతో లాబీయింగ్ ద్వారా పదవులను పొందాలనుకునే నేతలకు ఆమె ఎంపిక ఆశానిపాతం అయింది.
మీనాక్షి పార్టీ వ్యవహారాలు మాత్రమే కాదు.. ప్రభుత్వ వ్యవహారాల్లోనూ తలదూర్చుతున్నారు. HCU ఎపిసోడ్ లో దేశవ్యాప్తంగా తెలంగాణ కాంగ్రెస్ తోపాటు రాహుల్ గాంధీ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఏఐసీసీ దూతగా ఆమెను గ్రౌండ్ లెవల్ లో సిట్యుయేషన్ ఏంటో కనుక్కోవాలని సూచనతో మీనాక్షి వర్క్ స్టార్ట్ చేశారు. సెక్రటేరియట్ లో HCU భూవివాదంపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీతో భేటీ కావడం, వర్సిటీ స్టూడెంట్స్ తో సమావేశయ్యారు.
అసలు మీనాక్షి ఏ హోదాలో సెక్రటేరియట్ లో సమావేశం నిర్వహించారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ప్రతిపక్ష పార్టీగా వాళ్ల స్టాండ్ అది..సర్కార్ ను ఇరుకున పెట్టేందుకు విమర్శలు చేయాల్సిందే. కానీ, ఇలాంటి అభిప్రాయాలను సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా కొందరు ఓపెన్‌గా వ్యక్తం చేయడం చర్చనీయాంశం అవుతోంది.
ఇక పార్టీ కోసం కష్టపడిన నేతలకు మాత్రమే పదవులు ఇస్తాం..లాబీయింగ్ ద్వారా పదవులు ఇవ్వబోమని ఇప్పటికే మీనాక్షి ఖరాఖండిగా తేల్చేశారు. బొకేలు తీసుకొచ్చి ప్రదక్షిణలు చేసి సమయం వృధా చేసుకోవద్దని, కష్టపడిన నేతలకు పదవులు ఇచ్చే బాధ్యత తనదేనని చెప్పడం కొంతమంది సీనియర్లకు నచ్చడం లేదు. మీనాక్షి ఉండగా తమ ప్రయత్నాలు వర్కౌట్ అవ్వవని అనుకున్నారేమో , రాహుల్ కోర్ టీమ్ నేతను టార్గెట్ చేసేందుకు వెనుకాడటం లేదు.