ఇంత కాలం నాయకత్వం వహించిన సీనియర్లు పార్టీని పడుకోబెట్టేశారు. బయట నుంచి వచ్చిన నేత రేవంత్ రెడ్డి మళ్లీ లేపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ సీనియర్ నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీని లేపడానికి బయట వాళ్లు వస్తారా అని.. సేవ్ కాంగ్రెస్ పేరుతో సొంత పార్టీపైనే పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదంతా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల తాజా రాజకీయం.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు ఉత్తమ్ , జగ్గారెడ్డి, .మహేశ్వర్ రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ, దామోదర రాజనర్సింహ ఇలా ఓ పది మంది సీనియర్ నేతలు హైదరాబాద్లో సమావేశం అయ్యారు. అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎలా అంటే.. పార్టీపైనే పోరాటం చేయడం ద్వారా. కొత్తగా వేసిన కమిటీల్లో అంతా టీడీపీ వాళ్లే ఉన్నారని స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వాళ్లు టీడీపీ నేతలు ఎలా అవుతారో ఆయనకే తెలియాలి. రేవంత్ ను పార్టీలో చేర్చుకుంది ఉత్తమే. అయినా ఇప్పుడు రేవంత్ నాయకత్వంపై ఉత్తమ్ తిరుగుబాటు లచేస్తున్నారు.
హైదరాబాద్లో ప్రత్యేకంగా సమావేశమైన సీనియర్లు రేవంత్ పేరు ఎత్తకుండానే తీవ్ర విమర్శలు చేశారు. పార్టీని రక్షించుకునేందుకే ఒరిజనల్ కాంగ్రెస్ నేతలంతా సమావేశమయ్యామని ఉత్తమ్ చెప్పారు. కమిటీల్లోని 108 మందిలో 58 మంది తెలుగుదేశం పార్టీవాళ్లే ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నాలుగు పార్టీలు మారి వచ్చిన వ్యక్తి పార్టీని ఉద్దరిస్తాడా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ను నాశనం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని సీనియర్ నేత మధుయాష్కీ ఆరోపించారు.
రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అసంతృప్తిలో ఉన్నారు. ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. కమిటీలను ప్రకటించిన తర్వాత సీనియర్లలో అసంతృప్తి మరింత పెరిగిపోయింది. రేవంత్ నాయకత్వంపై వీరంతా తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకోవడంతో.. ఇక తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీని లెక్కలో నుంచి తీసేయవచ్చని రాజకీయవర్గాలు డిసైడైపోతున్నయి.