తెలంగాణ కాంగ్రెస్ ముందు అతి పెద్ద సమస్య జంపింగ్‌లు. దశాబ్దాలుగా పార్టీని అంటి పెట్టుకుని ఉన్న వారు కూడా… కండువాలు మార్చేస్తూండటంతో.. రాష్ట్ర నాయకత్వానికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎమ్మెల్యే ఎన్నికలు ముగిశాయి. గెలిచిన వారిలో మెజార్టీ జంపర్ల జాబితాలో చేరారు. రేపో.. మాపో.. జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. దీంతో… తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎవరు గెలిచినా.. కారెక్కుతారన్నట్లుగా పరిస్థితి మారిపోవడంతో.. ఈ సారి పార్టీ తరపున గెలిచిన వాళ్లను నిలబెట్టుకోవడం ఎలా అన్నదానిపై విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. చివరికి ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు. అదే “అఫిడవిట్లు”..!. గెలిచిన తర్వాత పార్టీ మారబోమని.. లిఖిత పూర్వకంగా అభ్యర్థుల దగ్గర్నుంచి ఈ అఫిడవిట్లు తీసుకోవాలనుకుంటున్నారట..!
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా… ప్రజల్లో ఓ రకమైన చర్చ జరిగింది. ఎవరు గెలిచినా టీఆర్ఎస్లో చేరుతున్నారని.. అలాంటప్పుడు.. ఇతర పార్టీలకు ఓటేయడం ఎందుకన్నదే ఆ చర్చ. ఈ విషయం గ్రహించి.. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన.. పొన్నం ప్రభాకర్ ఓ అఫిడవిట్ తయారు చేశారు. బాండ్ పేపర్‌పై.. తాను పార్టీ మారేది లేదని అచ్చు వేయించి… ప్రచారం చేసుకున్నారు. ఇదేదో బాగుందని… తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి అనిపించింది. ఇలాంటి వ్యూహం.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే.. పొన్నం స్వచ్చందంగా ఆ అఫిడవిట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం… అలా అఫిడవిట్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి ఇస్తేనే.. కాంగ్రెస్ తరపున స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పిస్తారట. ..! ఈ అఫిడవిట్ ఇచ్చిన… కాంగ్రెస్ తరపున గెలిచిన నేతలు.. తర్వాత టీఆర్ఎస్లోకి జంపయితే.. వారిపై చీటింగ్ కేసులు పెట్టే అవకాశాన్ని… కాంగ్రెస్ నేతలు కల్పించుకుంటున్నారు.
అయితే కాంగ్రెస్ నేతల అఫిడవిట్ల ఆలోచనలు ఇతర పార్టీల నేతలకు కాస్త విచిత్రంగానే ఉన్నాయి. ఎందుకంటే… రాజకీయాల్లో పార్టీ మారాలనుకున్న వారికి.. ఎలాంటి అడ్డంకులు ఉండవు. దానికి ఎమ్మెల్యేలే సాక్ష్యం. ఫిరాయింపుల చట్టం ఉన్నప్పటికీ.. ఆ చట్టం వారినేమీ చేయకపోవడమే.. దీనికి నిదర్శనం. ఇప్పుడు.. అఫిడవిట్ల పేరుతో.. వారిని కట్టడి చేయాలనుకోవడం కూడా.. కష్టమేనంటున్నారు. ఎందుకంటే.. ఈ అఫిడవిట్లు .. ఇలాంటి ఒప్పందాలకు చెల్లుబాటు అవుతాయా లేదా అన్నదానిపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.