ఎంతో కష్టపడి పని చేస్తున్నాం.. కేసీఆర్ పదేళ్లలో చేయలేనంత సంక్షేమాన్ని ఒక్క ఏడాదిలో చేశాం. అయినా మైలేజీ రావడం లేదు. కాంగ్రెస్ కోసం ఎవరూ పని చేయడం లేదని అని ఆ పార్టీ నేతలు మథనపడిపోతున్నారు. నిర్వహించే ప్రతి సమావేశంలోనూ ఇదే చెప్పుకుని బాధపడుతున్నారు. ఇక నుంచి అలకలు వీడాలని.. అందరూ కలసి కట్టుగా పని చేసి ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు చెప్పాలని కోరుతున్నారు అటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..ఇటు రేవంత్ రెడ్డికూడా అదే చెబుతున్నారు. పీసీసీ చీఫ్ అయితే పథకాలు ప్రజల్లోకి పోవట్లేదని అంటున్నారు. రేవంత్ అలాంటి మాటలు చెప్పకుండా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అంటున్నారు. రెండింటికి పెద్ద తేడా లేదు. మరి నిజంంగా కాంగ్రెస్ మేళ్లు ప్రజల్లోకి వెళ్లడం లేదా ?
కాంగ్రెస్ పై బలంగా వ్యతిరేక ప్రచారం
సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీపై బలంగా వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. భారత రాష్ట్ర సమితి ఈ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. రేవంత్ ప్రభుత్వం ఏమీ చేయలేదన్న భావనను వ్యాపించేందుకు వందకు వంద శాతం ప్రయత్నిస్తోంది. ఇదంతా సోషల్ మీడియా పుణ్యం. ఇప్పుడు రాజకీయాలకు సోషల్ మీడియాకు విడదీయలేనంత బంధం ఉంది. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే.. ఆటోమేటిక్ గా గ్రౌండ్ లెవల్ కు వెళ్లిపోతోంది. బీఆర్ఎస్ పార్టీ అదే చేస్తోంది. బలమైన వ్యతిరేక ప్రచారం చేస్తోంది.
చెప్పుకోలేకపోవడం ఎవరి తప్పు ?
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి బాగున్నాలేకపోయినా కొన్ని మంచి పనులు చేసింది. ఉచిత బస్సు పథకాన్ని రెండో రోజే అమలు చేసింది. నిజానికి ఇది గేమ్ చేంజర్.దీన్ని ప్రచారం చేసుకోలేకపోవడం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వ్యూహాత్మక లోపమే. ఈ పథకం వల్ల కొన్ని లక్షల మంది మహిళలకు ప్రయాణ ఖర్చులు మిగులుతున్నాయి. ఈ విషయాన్ని ఆ మహిళలు గుర్తుంచుకుని కృతజ్ఞత చూపేలా చేసుకోవాల్సింది ప్రభుత్వమే. కానీ అలా చేయలేకపోయింది. రుణమాఫీతో రైతులు ఎంతో లాభపడ్డారు. కానీ కొంత మందికి కాకపోవడం వల్ల సమస్యలు వచ్చాయి. వారిని ముందే సిద్ధం చేసి ఉంటే ఆ పథకం ప్రజల్లోకి వెళ్లేది. ఇలాంటి పీఆర్ సమస్యల కారణంగానే కాంగ్రెస్ వెనుకబడిపోయింది.
కార్యకర్తల్ని యాక్టివేట్ చేసుకోవడంలోనూ నిర్లక్ష్యమే
అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యకర్తల్ని యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి ఏదో ఓ పదవి దక్కేలా చేసి ఫీల్డ్ లో ఉండేలా చూసుకోవాల్సింది. పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర స్థాయి రాజకీయాలు.. బీసీ రిజర్వేషన్లతో ముడి పెట్టి కలగాపులగం చేసుకున్నారు. కానీ వెంటనే నిర్వహించేసి ఉంటే.. స్థానిక క్యాడర్ కు పదవులు వచ్చేవి. కానీ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరిగింది. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న వారి.. ఏదో విధంగా మేలు చేసే ప్రయత్నం క్షేత్ర స్థాయిలో జరగాల్సి ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడంతో వారు కూడా అంత ఆసక్తి చూపించడం లేదు. మరి మైలేజీ కష్టాల్లో తప్పు ఎక్కడ జరిగిందో.. అర్థం చేసుకుంటారా ?