తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితితో పాటు ఇతర చిన్నాచితక పార్టీలను క్రమబద్ధంగా కలుపుకుని పోయే ప్రక్రియను… విపక్ష పార్టీల నేతలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ పార్క్‌హయత్ హోటల్లో కాంగ్రెస్, టీడీపీ తెలంగాణ అగ్రనేతలు సమావేశమై పొత్తులపై చర్చలు జరిపారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు.. ఎల్.రమణ, పెద్దిరెడ్డి, నామా నాగేశ్వరరావులతో సమావేశమయ్యారు. పొత్తులపై ప్రాథమిక అవగాహనకు వచ్చారు. టీఆర్ఎస్ ను ఓడించాలంటే.. మహాకూటమిగా బరిలోకి దిగాలని నిర్ణయించారు.
టీడీపీ ఇప్పటికే సీపీఐ, తెలంగాణ జనసమితితో చర్చలు జరిపింది. కొద్ది రోజుల కింట.. రమణ – చాడ వెంకటరెడ్డి మధ్య జరిగిన సమావేశంలో అందరూ కలసి పోరాడాలన్న నిర్ణయానికి వచ్చారు. నిన్న కోదండరామ్‌తోనూ రమణ భేటీ అయ్యారు. భారత్ బంద్ లో పాల్గొని అరెస్టయిన రమణను కోదండరామ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పరామర్శించారు. అక్కడే పలు అంశాలపై చర్చించారు. ఏయే నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీ చేయాలన్న అంశంతో పాటు.. మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై కూడా ఓ అవగాహనకు వచ్చారు. కేసీఆర్ ఓటమే లక్ష్యంగా మహాకూటమిగా ముందుకెళతామని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ చర్చల తర్వాత స్పష్టం చేశాయి. పొత్తులపై ప్రాథమిక చర్చలే జరిగాయని పీసీసీ చీఫ్ ఉత్తమ్ చెప్పినప్పటికీ.. ఇప్పటికే..అన్ని పార్టీల మధ్య సీట్లు, స్థానాలపై ఓ అవగాహనకు వచ్చారన్న ప్రచారం జరుగుతోంది.
మహాకూటమిలో ప్రజా సంఘాలనూ, విద్యార్థి సంఘాలను కలుపుకుని వెళ్లాలని నేతలు నిర్ణయించారు. మేనిఫెస్టోను ఉమ్మడిగా ప్రజల ముందుంచుతామన్నారు. మహాకూటమి నేతృత్వంలో భారీ బహిరంగ సభకు పార్టీలన్నీప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఒక్క సీపీఎం మినహా.. మిగాతా అన్ని పార్టీలు… మహాకూటమిలో భాగంగా ఉడేందుకు సిద్ధపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా.. అందరికీ.. వారి వారి బలాల్ని బట్టి.. సీట్లను కేటాయించడానికి ముందుకు వస్తోంది. కొంత మంది నేతలు అసంతృప్తికి గురైనా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న వ్యూహంతో ముందుకెళ్తోంది. దానికి సంబంధించిన చర్చలన్నీ రైట్ ట్రాక్ లోనే నడుస్తున్నాయని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.