ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీని గెలిపించుకునేందుకు అవసరమైన బలం కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాస్తంత వ్యూహాత్మంగా… ఎమ్మెల్యేలంతా.. పార్టీకి కట్టుబడి ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ముందుగానే చేతులెత్తేయకుండా.. ప్రయత్నాలు అయితే ప్రారంభించింది కాంగ్రెస్. కానీ ఆ ప్రయత్నాలు… మరింత గందరగోళం సృష్టిస్తున్నాయి. ఏకంగా ఎమ్మెల్సీ బరిలో నిలబడేందుకు 33 మంది ముందుకువచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లు, టిక్కెట్లు రాని వాళ్లు కూడా రేసులో ఉన్నారు. మర్రి శశిధర్ రెడ్డి పేరును కూడా కాంగ్రెస్ సీరియస్‌గా పరిశీలిస్తోంది. సంఖ్యా బలం ప్రకారం టిఆర్ఎస్ 4, కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. అధికార పార్టీ ఐదు స్థానాలకు మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి పోటీచేస్తోంది.
శాసన సభ్యుల సంఖ్యప్రకారం ఒక్కో ఎమ్మెల్సీకి 21మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఇద్దరు ఇండిపెండెంట్, ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలుపుకుని 91 మంది. ఇక ఎంఐఎం ఎమ్మెల్యేలు ఏడు గురితో కలిపితే మొత్తం బలం 98. ఐదు ఎమ్మెల్సీ స్థానాలు గెలవాలంటే 105మంది ఎమ్మెల్యేలు అవసరం. అంటే ఈ లెక్కన టిఆర్ఎస్ నాలుగు స్థానాలు గెలవడానికి అవసరమైన బలం ఉంది. ఐదో స్థానానానికి మరో ఏడు మంది ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు. టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో సండ్ర వైఖరి అనుమానాస్పదంగా ఉంది. టిఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించొచ్చు. బీజేపీ ఎమ్మెల్యే బాయ్‌కాట్ చేయవచ్చు. కాంగ్రెస్ కు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వర్ రావు కూడా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే ఛాన్స్ ఉంది. దాంతో కాంగ్రెస్ బలం 20అవుతుంది. ఈ లెక్కల ప్రకారం ఐదో స్థానం గెలుచుకోవాలంటే టిఆర్ఎస్ కు ఆరు మంది ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ కు ఒక ఎమ్మెల్యే తక్కువగా ఉంటారు. అయితే ఎలిమినేషన్ పద్దతిలో లెక్కింపు ఉంటుంది కాబట్టి శాసన సభ్యులు అందరూ వోటింగ్ లో పాల్గొంటే మాత్రం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు అవకాశం లేకుండానే కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారు.
అలా కాకుండా బీజేపీ ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరైతే అప్పుడు ఒక్కో ఎమ్మెల్సీకి కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య పంతొమ్మిదికి తగ్గుతుంది. అప్పుడు కాంగ్రెస్ బలం 18కి పడిపోతుంది. వారికి ఉన్న ఎమ్మెల్యేలు సరిపోతారు. అదే జరిగితే టిఆర్ఎస్ మిత్రపక్షంతో కలిసి ఐదు ఎమ్మెలసీలను గెలుచుకుంటుంది. టీఆర్ఎస్ ఇప్పటికే మైండ్ గేమ్ ప్రారంభించింది. అదే కాంగ్రెస్‌కు ఆందోళనకు గురి చేస్తుంది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు కూడా వేయనక్కర్లేదు.. గైర్హాజరైతే చాలు.. టీఆర్ఎస్ మిషన్ 5 కంప్లీట్ అవుతుంది.