కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెబుతూంటారు. ఎందుకంటే అక్కడ ఉండే గ్రూపులు అన్ని మరి. ఇతర పార్టీలపై పోరాడటం కన్నా వారిలో వారు పోరాడటానికే ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ట్రాక్‌లోకి వచ్చినట్లుగా ఉంది కానీ.. బీజేపీ మాత్రం కాంగ్రెస్ లా మారిపోయింది. ఆ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. తాజాగా.. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి రెడ్డి ఫాం హౌస్ లో తెలంగాణ బీజేపీ నేతల రహస్య భేటీ నిర్వహించారు.
విజయశాంతి, వివేక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి , బూర నరసయ్య వంటి వారు పాల్గొన్నారు. వారి ఎజెండా ఏమిటో తెలియదు కానీ.. వీరిలో ఇద్దరు మాజీ ఎంపీలు మాత్రం టిక్కెట్ ఇస్తే కాంగ్రెస్ లోకి వచ్చేస్తామన్న ప్రతిపాదన పెట్టారని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఈటల రాజేందర్ వ్యవహారశైలి కూడా అనుమానాస్పదంగా మారింది. ఆయనకు పగ్గాలివ్వాలలని కొందరు.. వద్దని కొందరు పోటీ పడి ఢిల్లీకి వెళ్తున్నారు. బండి సంజయ్ ను… కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని..
ఈటలకు పగ్గాలిస్తారని కొంతమంది విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఏం జరిగినప్పటికీ.. బీజేపీ ఇప్పటికే రేసు నుంచి వైదొలిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే వారం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉంటాయని చెబుతున్నారు. ఈ క్రమంలో బీజేపీలో తాడో పేడో తేల్చుకోవాలనుకునే నేతల సంఖ్య పెరిగిపోయింది. బీఆర్ఎస్ ను ఓడించే పార్టీగా .. కాంగ్రెస్ కు ఇమేజ్ మరింత పెరిగితే.. ఇక బీజేపీ పనైపోయినట్లే చెప్పుకోవడం ప్రారంభిస్తారు.