తెలంగాణలో ఒక్క రోజే 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 229కి చేరాయి. అదే సమయంలో.. మరో ఇద్దరు చనిపోయారు. దీంతో కరోనా కారణంగా తెలంగాణలో చనిపోయిన వారి సంఖ్య పదకొండుకు చేరింది. అయితే.. వైద్యుల కృషితో పదిహేను మందికి నెగెటివ్ వచ్చింది. వారందర్నీ డిశ్చార్జ్ చేశారు. అంటే ప్రస్తుతం తెలంగాణ ఆస్పత్రుల్లో 186 మంది కరోనా పాజిటివ్‌కు చికిత్స పొందుతున్నారు. కొత్తగా వెలుగు చూసినా కరోనా పాజిటివ్ కేసులన్నీ ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇలా వెళ్లి వచ్చిన వారందర్నీ ప్రభుత్వం గుర్తించిందని.. వారందర్నీ క్వారంటైన్ కు తరలించామని అధికారవర్గాలు చెబుతున్నాయి. చనిపోయిన ఇద్దరు కూడా… మర్కజ్ సమావేశాలకు వెళ్లిన వారేనని తెలుస్తోంది. వారితో కాంటాక్ట్‌లో ఉన్న వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణలో ఇప్పటి వరకూ 32 మంది కరోనా పాజిటివ్ వ్యక్తులకు చికిత్స ద్వారా నెగెటివ్ వచ్చింది. ఇది కూడా ఓ రికార్డే. ఇంకా పెద్ద ఎత్తున కరోనా అనుమానితులు, మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారి శాంపిళ్లు ల్యాబుల్లో ఉన్నాయి. వాటిని పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం.. ఢిల్లీ మర్కజ్ కు వెళ్లిన వారికి సగటున… ప్రతి ముగ్గురిలో ఒకరికి కరోనా వైరస్ బయటపడుతోంది కాబట్టి.. ఈ సంఖ్య ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో.. వీరి కాంటాక్ట్ కేసులు కూడా.. అంతకు మించి పెరుగుతున్నాయి. మర్కజ్ ప్రార్థనల విషయం బయటకు రాక ముందు కేసీఆర్.. ఏప్రిల్ ఏడో తేదీ కల్లా… కరోనా ఫ్రీ స్టేట్‌గా తెలంగాణను చూడాలని అనుకున్నారు.
అయితే.. అలా ప్రకటన చేసిన రోజే… ఇలా ఢిల్లీ నుంచి వచ్చిన వారు ఆరుగురు చనిపోయారు. దీంతో.. ఒక్క సారిగా గందరగోళం ప్రారంభమయింది. ఢిల్లీ మర్కజ్ సమావేశాలకు వెళ్లి వచ్చిన వారందరికీ టెస్టులు చేస్తున్నారు. వారితో కాంటాక్టులో ఉన్న వారికీ టెస్టులు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. తమిళనాడులో వందకుపైగా పాజిటివ్ కేసులు మర్కజ్ కు వెళ్లి వచ్చిన ద్వారానే ఒక్క రోజులో వెలుగు చూశాయి.