తెలంగాణ సర్కార్ కరోనా టెస్టులు పెద్దగా చేయడం లేదని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్న సమయంలో.. ఇదే అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణలో కరోనా పరీక్షలు జరపడం లేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్పై విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా లక్షణాలతో చనిపోయిన వారికి కూడా పరీక్షలు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించింది.
డబ్ల్యూహెచ్వో, కేంద్రం మార్గదర్శకాల ప్రకారమే వ్యవహరిస్తున్నామని తెలిపిన అడ్వకేట్ జనరల్ చెప్పుకొచ్చారు.వీరి మార్గదర్శకాల ప్రకారం లక్షణాలు ఉన్న వారికే చేస్తున్నామని వాదించారు. ఏజీ వాదనపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
అనుమానితులకే కరోనా పరీక్షలు చేయాలని ఎందుకు నిర్ణయించారో చెప్పాలని.. లక్షణాలు ఉన్న వారికే పరీక్ష చేయాలని… డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాల్లో ఎక్కడుందని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. వీలైనంత ఎక్కువ మందికి పరీక్షలు ఎందుకు చేయడం లేదో చెప్పాలనిఆదేశించింది. గణాంకాలతో గజిబిజి చేస్తే కరోనా వ్యాప్తిపై వాస్తవాలు తెలియదని పూర్తి సమాచారం ఇవ్వాలని.. పధ్నాలుగో తేదీకి విచారణను వాయిదా వేసింది ధర్మానసం. తెలంగాణలో కొద్ది రోజులుగా పెద్దగా కేసులు నమోదు కావడం లేదు. టెస్టులే చేయడం లేదని..అందుకే నమోదు కావడం లేదని.. విపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు.
అత్యధిక టెస్టులు చేస్తే..ఏం ప్రయోజనం అని..రాపిడ్ టెస్టులు తాము చేయబోమని ప్రభుత్వం చెబుతోంది. విపక్షాల విమర్శలపై కేసీఆర్ ప్రెస్మీట్లో విపక్షాలపై మండిపడ్డారు. సన్నాసులని దూషించారు. దీనిపై విపక్షపార్టీలు కూడా.. తమదైన శైలిలో విమర్శలు గుప్పించాయి. ఇప్పుడు నేరుగా కోర్టులోనే పిటిషన్ వేయడంతో.. ఇప్పటి వరకూ..తెలంగాణ సర్కార్ ఎన్ని టెస్టులు చేసిందో.. మొత్తం బయటపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడినట్లుగా తెలుస్తోంది.