తెలంగాణలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. దళారులు, వ్యాపారుల దోపిడీతో దసరా సరదా ఆవిరైపోయింది. ఎకరా పత్తికి కనీసం 5600 రూపాయల పెట్టుబడి పెట్టిన రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం వాస్తవ విరుద్ధంగా 4900 రూపాయల మద్దతు ధరను ప్రకటించింది. పోనీ అదైనా వస్తుందా అంటే అదీ లేదు.
మార్కెట్ యార్డుల్లో వ్యాపారుల ఇష్టారాజ్యం నడుస్తోంది. అధికారుల కళ్లముందే నిలువు దోపిడీ జరుగుతోంది. పత్తి నాణ్యతను, తేమను నిర్ణయించడానికి పరికరాలేవీ లేవు. వ్యాపారులు చేతితో పత్తిని పట్టుకుని నాణ్యత నిర్ణయిస్తున్నారు. అడ్డగోలు ధర ఫిక్స్ చేస్తున్నారు. ఇదేమి ఘోరమని అధికారులను అడిగితే, పరికరాల కొనుగోలుకు సమయం అడుగుతున్నారని జవాబు చెప్తున్నారు. పరికరాలు లేని వారి వ్యాపారులను పత్తి కొనడానికి అనుమతించేది లేదని ప్రకటిస్తే దెబ్బకు దారికి రారా? అధికారులు ఆ పని చేయరు. అలా చేయండి అని కేసీఆర్ ప్రభుత్వం చెప్పదు.
వరంగల్, ఖమ్మం మార్కెట్లలో రైతుల బాధను చూస్తే కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఓ వైపు దసరా పండుగ వస్తోంది. పత్తిని అమ్ముకుంటే వచ్చే డబ్బుతో బట్టలు కొనుక్కోవచ్చు, సరదాగా పండుగ చేసుకోవచ్చని రైతులు ఆశించారు. ఇదే అదనుగా వ్యాపారులు కనీసం 4 వేలు కూడా రేటు ఇవ్వం పొమ్మంటున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేని కొందరు రైతులు దు:ఖాన్ని ఆపుకొంటూ వ్యాపారులు చెప్పిన ధరకు పత్తిని అమ్ముకుని ఇంటి ముఖం పట్టారు. మరి కొందరు మంచి ధర రాకపోతుందా అని మార్కెట్లలో పడిగాపులు పడుతున్నారు.
మరోవైపు, బంగారు తెలంగాణ తెస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాం హౌస్ లో బిజీగా ఉన్నారు. తన తోటలో పండించిన పంటలను పరిశీలించే పనిలో ఉన్నారు. కోటీశ్వరుడైన కేసీఆర్, అల్లం పంట దెబ్బతిన్నదని తెగ ఇదైపోయారు. పేద రైతుల బాధలను మాత్రం ఆయన సర్కార్ పట్టించుకోవడం లేదు. ఇంత జరుగుతున్నా, మంగళవారం నాడు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రతిపక్షాలపై ఎదురు దాడి చేశారు. ఏవేవో లెక్కలు చెప్పారు.
ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడటంలో తెరాస తర్వాతే ఎవరైనా. ఓ వైపు రైతు ఆత్మహత్యలు జరుగుతుంటే వాటిని ఆపడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించింది లేదు. ఆత్మహత్య చేసుకున్న వారికోసం ప్యాకేజీ ప్రకటిస్తే సరిపోతుందా? అసలు రైతు ఆత్మహత్య చేసుకోని పరిస్థితి తీసుకు రావడం సాధ్యంకాదా?
ఊ అంటే ఇది సంపన్న రాష్ట్రం అంటారు. గుజరాత్ తో పోలుస్తారు. గుజరాత్ లో రైతుల పరిస్థితి ఇంత దారుణంగా లేదే? పత్తి పంటను భారీగా పండించే గుజరాత్ లో రైతులు మన రైతుల్లా అలమటించడం లేదే? అక్కడి ప్రభుత్వం పత్తి రైతులకు అన్యాయం జరగకుండా చూస్తున్న తీరును తెలుసుకోరే? రైతుల పేరుతో ఎమ్మెల్యేలు ఇజ్రాయిల్ టూరుకు వెళ్లి రాగానే రైతు రాజ్యం, బంగారు తెలంగాణ వచ్చేస్తాయా?
దసరా పండుగ వేళ పత్తి రైతుల ఉసురు పోసుకుంటున్న వ్యాపారుల పని పట్టడం ఈ ప్రభుత్వం వల్ల కాదని స్పష్టమైంది. ప్రభుత్వం ఇంత దారుణంగా చేతులు ముడుచుకుని కూర్చున్నప్పుడు ఆత్మహత్యలు పెరగవా?