ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి… ఈ పోస్టుకు ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే, ఉన్నతాధికారులు ఈ పోస్టు కోసం పోటీ పడుతుంటారు. ఇప్పుడు తెలంగాణ సీఎస్ విషయంలో కూడా ఇలాంటి పోటీ కనిపిస్తోంది. ప్రస్తుత సీఎస్ ఎస్.కె. జోషి ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేస్తున్నారు. 2018 ఫిబ్రవరి నుంచి సీఎస్ గా జోషి బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఈయనకి బాగానే సింక్ అయింది. దీంతో, ప్రస్తుతం ఆయన పదవీ కాలాన్ని ఇంకొన్నాళ్లు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ అవకాశం ఉన్నా కూడా జోషి పెద్దగా ఆసక్తి చూపడం లేదనీ, పదవీ విమరణకే మొగ్గుచూపుతున్నారని సమాచారం. దీంతో కొత్త సీఎస్ ఎంపికపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించాల్సి ఉంది.
ఈ పదవి కోసం ఇప్పటికే చాలామంది ఉన్నతాధికారులు రేసులో కనిపిస్తున్నారు. సీనియారిటీ ప్రకారం చూసుకుంటే… 1983 బ్యాచ్ కి చెందిన బీపీ ఆచార్య ముందు వరుసలో ఉన్నారు. ఆ తరువాతి స్థానంలో బినయ్ కుమార్, అజయ్ మిశ్రాలున్నారు. అయితే, ఆచార్య వచ్చే ఏడాది మే నెలలో రిటైర్ అయిపోతారు. బినయ్ కుమార్ కి కూడా జులైలో రిటైర్మెంట్ ఉంది. పుష్పా సుబ్రహ్మణ్యం, సురేష్ చందా, చిత్రా రామచంద్రన్, హీరాలాల్ సమారియా… వీరంతా తరువా తి వరుసలో, అంటే 1985 బ్యాచ్ కి చెందినవారు. పుష్పా ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. చిత్రా రామచంద్రన్ ను మరో 16 నెలలు సర్వీస్ ఉంది. హీరాలాల్ కి మరో 9 నెలలు సర్వీస్ ఉంది. ఆ తరువాత రాజేశ్వర్ తివారీ, రాజీవ్ రంజన్ మిశ్రా, వసుధామిశ్రా, శాలినీమిశ్రా, ఎ.సిన్హా, సోమేష్ కుమార్, శాంతికుమారి తరువాతి వరుసలో ఉన్నారు.
అజయ్ మిశ్రా, సోమేష్ కుమార్ ల మధ్య అసలైన పోటీ ఉందని సమాచారం. అజయ్ మిశ్రాకు ప్రభుత్వంతో ఎలాంటి వివాదాల్లేవు. సీఎం కేసీఆర్ కూడా ఆయనవైపే మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, ఆయనకు మరో ఏడు నెలలు మాత్రమే సర్వీస్ ఉండటాన్ని పరిగణించి పక్కనపెడతారా అనే అభిప్రాయం ఉంది. ఆయన కాకుంటే సోమేష్ కుమార్ కి ఛాన్స్ ఉంది అంటున్నారు. అయితే, విభజన సమయంలో ఆయన్ని ఆంధ్రప్రదేశ్ కి కేటాయించారు. కానీ, ఆయన కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని ఇక్కడే కొనసాగుతున్నారు. ఒక రాష్ట్ర కేడర్ అధికారి మరో రాష్ట్రానికి సీఎస్ గా నియమించుకునే వెలుసుబాటు ఉంది. ఆ లెక్కన ఈయనకి ముఖ్యమంత్రి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా, ఇప్పుడు సీఎస్ పదవి కోసం సీఎం చుట్టూ దాదాపు 15 మంది ఉన్నతాధికారులు చక్కర్లు కొడుతున్నట్టు సమాచారం. ఇది సీఎం విచక్షణతో భర్తీ అయ్యే కీలక పోస్టు కదా!