పాలనలోకి వచ్చిన నాటినుంచి అనేకానేక విషయాల్లో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ.. బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా దూసుకెళ్తున్నామని చెబుతూ వస్తున్న కల్వకుంట్ల వారి సర్కారు తాజాగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రథమ పౌరుడు, గవర్నర్ నరసింహన్ అధికారాలకు కూడా కోత పెట్టింది. గవర్నర్ అంటేనే ప్రాథమికంగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను ఆమోదించడం తప్ప, వాటికి ఆమోద ముద్ర వేయడం తప్ప.. స్వతంత్రంగా వ్యవహరించగల పని అంటూ ఏదీ ఉండదని అంతా అనుకుంటూ ఉంటారు. చాలా వరకు అది నిజం కూడా అలాంటి నేపథ్యంలో.. ఆయన తనకు పూర్తి అధికారాలు ఉన్నట్లుగా భావించే ఒక వ్యవస్థ… యూనివర్సిటీల వ్యవస్థ. రాష్ట్రంలో ఉండే అన్ని యూనివర్సిటీలకు సాధారణంగా గవర్నరే ఛాన్సలర్‌గా ఉంటారు. వైస్ ఛాన్సలర్ల నియామకం రాష్ట్ర ప్రభుత్వాల సిఫారసు మేరకు జరిగేదే అయినప్పటికీ.. ఛాన్సలర్‌గా ఆయనకు యూనివర్సిటీల మీద విశిష్ట అధికారాలు ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే తాజాగా కేసీఆర్… అసెంబ్లీలో పాస్ చేసిన ఒక బిల్లు ద్వారా.. గవర్నర్ నరసింహన్ అధికారాలకు కోత పెట్టింది.
రాష్ట్రంలోని యూనివర్సిటీలు గాడి తప్పుతున్నాయని… వాటిని దారిలో పెట్టాల్సిన అవసరం ఉన్నదని ప్రకటించిన సీఎం కేసీఆర్ వీసీల సహా, చాన్సలర్ల నియామక అధికారాలు కూడా ప్రభుత్వం చేతిలోనే ఉండేలా చట్టం చేశారు. దీనివలన ప్రతి యూనివర్సిటీకి విడివిడిగా చాన్సలర్ల నియామకం కూడా జరుగుతుంది. ప్రస్తుతం అంబేద్కర్, రాజీవ్ గాంధీ టెక్నలాజికల్ యూనివర్సిటీలకు చాన్సలర్ ల నియామకంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు మొదలవుతాయి.
గవర్నర్లు నాంకేవాస్తే వర్సిటీల చాన్సలర్లు అయినప్పటికీ.. అందులో వారి జోక్యం గతంలో పరిమితంగానే ఉండేది. కానీ నరసింహన్ గవర్నర్ అయ్యాక కాస్త ఎక్కువ జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. చివరికి అసలు గవర్నరుకు వర్సిటీలతో సంబంధమే లేకుండా కేసీఆర్ సర్కారు చేసేశారు. ఇప్పుడు ప్రతి వర్సిటీకి ఒక సుప్రీం లేదా హైకోర్టు మాజీ న్యాయమూర్తులను, తత్సమానమైన మేధావులను నిపుణులను చాన్సలర్లుగా నియమించే అవకాశాన్ని కేసీఆర్ సర్కారు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ నిర్ణయంతో కేసీఆర్ సర్కారుకు తమకు కావాల్సిన వారికి ఉన్నత హోదా గల కీలక పదవులు కట్టబెట్టడంలో మరింత వెసులుబాటు చిక్కినట్లే లెక్క. పార్టీ మెచ్చిన మేధావులకు చాన్సలర్ల పోస్టులు ఇబ్బడి ముబ్బడిగా ఇవ్వవచ్చు. మాజీ న్యాయమూర్తులకు పదవులు ఇస్తాం అని కేసీఆర్ అనుకుంటున్నారు గాబట్టి.. ఈ నిర్ణయం వల్ల ఇతరత్రా రాజకీయ పరమైన ప్రయోజనాలు కూడా ప్రభుత్వానికి పుష్కలంగా ఉంటాయని పలువురు అంచనా వేస్తున్నారు.