సేవలు, ఫార్మా రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ ఇప్పుడు తయారీ రంగంలోనూ తనదైన ముద్ర వేసే అది పెద్ద ప్రాజెక్టును దక్కించుకుంది. ప్రపంచస్థాయి టీవీ, స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ తయారీదారులకు అసవరమైన ఉత్పత్తులను సరఫరా చేసేందుకు అమోలెడ్ డిస్ప్లే యూనిట్లను తయారుచేయడానికి హైదరాబాద్‌లో రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ రూ.24000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నది. ఈ మేరకు ఒప్పందాలు కూడా జరిగాయి. ఫార్చ్యూన్-500 కంపెనీల్లో ఒకటైన ఈ సంస్థ దేశంలోనే తొలిసారి తన డిస్ప్లే ఫ్యాబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది.
డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ ప్లాంట్‌లో ల్యాప్‌టాప్, ట్యాబ్, మొబైల్లో ఉపయోగించే స్క్రీన్లను తయారు చేస్తారు. గాజు ఫలకలపై ఒత్తిడి పెంచి సంక్షిష్లంగా రూపొందించి, వీటిని ట్రాన్సిస్టర్ సెల్స్‌కు అనుసంధానం చేస్తారు. ఇందుకోసం సిలికాన్, లోహాలను వినియోగిస్తారు. ఈ స్క్రీన్లకు విద్యుత్తును పంపి వెలిగిస్తారు. తెలంగాణాకు వచ్చిన అతిపెద్ద పెట్టుబడి ఇదే. హైదరాబాద్‌లో ఈ కం పెనీ నెలకొల్పే యూనిట్ ద్వారా దాదాపు 3 వేల మంది సైంటిస్టులు, టెక్నాలజీ నిపుణులకు ప్రత్యక్షంగా, అడ్వాన్స్డ్ హైటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి చెందిన అనుబంధ సంస్థలు, వేల మంది సరఫరాదారులకు పరోక్షం గా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
నగర శివారులోని దుండిగల్‌లో 50 ఎకరాల్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుండగా, ఆ తర్వాత మరో 300 ఎకరాల్లో అత్యంత ఆధునాతన తయారీ ఫ్యాక్టరీని నిర్మించనుంది. ఈ పెట్టుబడితో భారత్ అడ్వాన్స్డ్ హైటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో జపాన్, చైనా, అమెరికా లాంటి దేశాల సరసన నిలుస్తుంది. ఇప్పటి వరకు జపాన్, కొరియా, తైవాన్ నుంచి మాత్రమే ఉత్పత్తవుతున్నాయి. ఈ యూనిట్ ఏర్పాటుతో ప్రపంచంలోని దిగ్గజ ఎలక్ట్రానిక్ కంపెనీలు, వాటి అనుబంధ సంస్థలు రాష్ర్టానికి వచ్చే అవకాశం ఉంది.