తెలంగాణ ముఖ్యమంత్రి చైనా పర్యటన ఆయనలో చాలా మార్పు తెచ్చినట్టుంది. నత్తనడక సాగేనిర్మాణాలకు బదులు, చైనా టెక్నాలజీతో చకచకా పనులు చేపట్టాలని ఆయన నిర్ణయించారు. ఈ మేరకు ఆ దేశ బృందానికి తన ఉద్దేశాన్ని వివరించారు. చేయాల్సిన పనులేమిటో వివరించారు. అవి ఎప్పట్లోగా పూర్తవుతాయో నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. హైదరాబాద్ లో మల్టిపుల్ ఫ్లై ఓవర్లు, రాష్ట్రంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు, హుస్సేన్ సాగర్ వద్ద ఆకాశ హర్మ్యాల నిర్మాణం సహా భారీ సివిల్ పనులన్నింటిలోనూ చైనా టెక్నాలజీని వాడాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఒక్కరో్జులోనే మూడు అంతస్తులు నిర్మించే సత్తా గల చైనా సాంకేతికతతో పనిదినాలు కలిసిరావడంతో పాటు బడ్జెట్ లోనూ భారీగా ఆదా అవుతుంది. సివిల్ పనులు ఆలస్యమయ్యే కొద్దీ ఖర్చు పెరుగుతుంది.
ఎప్పటికప్పుడు సిమెంటు, స్టీలు ధరలు, ఇతరత్రా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. దీంతో నిర్మాణం ఆలస్యమయ్యే కొద్దీ అంచనాలను మించి భారీగా అదనపు వ్యయం అవుతుంది. దీన్ని అరికట్టాలంటే చైనా టెక్నాలజీయే సరైందని కేసీఆర్ భావిస్తున్నారు.
బంగారు తెలంగాణ సాధనలో మౌలిక సదుపాయాలు చాలా కీలకం. ఎత్తిపోతల పథకాలు, వంతెనలు సహా అనేక భారీ నిర్మాణాలు చేయాల్సి ఉంది. జాప్యం జరగకుండా సకాలంలో పూర్తి చేయడానికి చైనా సహకారం తీసుకోవడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే కేసీఆర్ ను కలిసిన చైనా బృందం, పలు జిల్లాల్లో పర్యటిస్తోంది. అక్కడ చేపట్టాల్సిన పనుల వివరాలను తెలుసుకుంటోంది. మొత్తం మీద ఎంత కాలంలో పనులు పూర్తవుతాయనేది ఓ నెల రోజుల్లో నివేదిక సమర్పిస్తుంది. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ ప్రారంభం అవుతుంది.