తెలంగాణలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు తీవ్రంగా కసరత్తు జరుగుతోంది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయనున్నారు. దీంతో కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలపై అప్పుడే ఊహాగానాలు, అంచనాలు మొదలయ్యాయి.
కేసీఆర్ స్వస్థలం సిద్దిపేట జిల్లా ఏర్పాటు ఖాయమని తెలుస్తోంది. ఆయన సొంత జిల్లా మెదక్ రూపురేఖలు మారనున్నాయి, పొరుగు జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలను కలుపుతూ మొత్తం మూడు జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. సంగారెడ్డి, మెదక్ పేరుతో జిల్లాల ఏర్పాటు దాదాపుగా ఖాయమైంది.
రాజధాని హైదరాబాదును రెండు జిల్లాలుగా విభజించాలని కేసీఆర్ యోచిస్తున్నారు. జనాభా పెరుగుతున్నా జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరగడం శాస్త్రీయం కాదని ఆయన భావిస్తున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ పేరుతో మరో జిల్లా ఏర్పాటు కానుంది. అయితే సైబరాబాద్ ప్రాంతాన్ని ఒక జిల్లాగా చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. అదే జరిగితే రాజధాని ప్రాంతంలో మూడు జిల్లాలవుతాయి. దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
భౌగోళికంగా అతిపెద్దదైన ఆదిలాబాద్ జిల్లాను రెండు విభజించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఆ జిల్లాలోని మంచిర్యాల పేరుతో కొత్త జిల్లా ఏర్పడుతుంది. కరీంనగర్ జిల్లాలోని రామగుండం ప్రాంతం కొత్త జిల్లాలోకి వెళ్తుందా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు. ఇక, కరీంనగర్ జిల్లాలో జగిత్యాల జిల్లా ఏర్పాటుకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం పేరుతో కొత్త జిల్లా ఏర్పడుతుంది. నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి, నల్గొండ జిల్లాలో భువనగిరి పేరుతో కొత్త జిల్లాలు ఏర్పడే అవకాశాలున్నాయి. వరంగల్ జిల్లాలోనూ మరో జిల్లా రాబోతుంది. మహబూబా బాద్ జిల్లా చేస్తారా లేక మరో విధంగా విభజన చేస్తారా అనేదానిపై నిర్ణయం తీసుకోలేదు. మహబూబ్ నగర్ లో నాగర్ కర్నూలు పేరుతో కొత్త జిల్లా ఏర్పాటుకు కూడా నిర్ణయించారని తెలుస్తోంది. పొరుగుజిల్లాల్లోని సమీప మండలాలను విలీనం చేయడం ద్వారా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తారు.
ఇప్పుడున్న పది జిల్లాలను 24 నుంచి 25కు పెంచాలనేది కేసీఆర్ ఉద్దేశం. పరిపాలన సౌలభ్యం కోసం ఇది తప్పనిసరి అని ఆయన భావిస్తున్నారు. అలాగే కొత్తగా 40 మండలాలు కూడా ఏర్పడబోతున్నాయి. అయితే జిల్లాలు పెరిగితే ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల సంఖ్య కూడా పెరగాలి. ఎన్ని జిల్లాలు ఏర్పడితే అంత మంది కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలను నియమించాల్సి ఉంటుంది.
తెలంగాణలో ఇంత మంది ఉన్నతాధికారుల నియామకానికి అవకాశం ఉందా అనేది ప్రశ్న. జిల్లాల్లోనే కాకుండా సచివాలయంలో శాఖల వారీగా సెక్రటరీలు తప్పనిసరి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఇబ్బందికరం కావచ్చనే ఒక అభిప్రాయం ఉంది. అయినా సరే ముందుకే వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. వచ్చే నెలలో కొత్త జిల్లాలపై స్పష్టమైన వివరాలు అందరికీ తెలియబోతున్నాయి.