టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమించిన దాదాపు మూడు నెలల తర్వాత ప్రభుత్వం సభ్యులను ఖరారు చేసింది. ఈ మధ్యలో… పాలక మండలి సభ్యులను ఇరవై ఐదు మందిగా.. ఎక్స్ అఫిషియో సభ్యులను మరో నలుగుర్ని చేర్చి… 29 మందితో జంబో పాలకమండలి కోసం.. ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ మేరకు సభ్యులను ఖరారు చేశారు. ఏపీ నుంచి ఎనిమిది మందికి, తెలంగాణ నుంచి ఏడుగురికి, తమిళనాడు నుంచి నలుగురికి, కర్ణాటక నుంచి ముగ్గురికి, ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి టీటీడీలో చోటు దక్కింది. ఏపీ నుంచి గొల్ల బాబూరావు, నాదెండ్ల సుబ్బారావు, ప్రశాంతి, యూవీ రమణమూర్తి, మల్లికార్జునరెడ్డి, డీపీ అనంత, చిప్పగిరి ప్రసాద్‌కుమార్, పార్థసారథికి సభ్యులుగా చోటిచ్చారు. వీరిలో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు.
తెలంగాణ నుంచి రామేశ్వరరావు, బి.పార్థసారథిరెడ్డి, వెంకటభాస్కరరావు, మూరంశెట్టి రాములు, డి.దామోదరరావు, కె.శివకుమార్, పుట్టా ప్రతాప్‌రెడ్డికి అవకాశం కల్పించారు. ఈ జాబితా అంతా.. టీఆర్ఎస్ నుంచి అందినట్లుగా ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ స్వయంగా చేసిన సిఫార్సుల మేరకే.. ఏకంగా తెలంగాణ నుంచి ఏడుగుర్ని సభ్యులుగా నియమించినట్లుగా భావిస్తున్నారు. గత ప్రభుత్వం చాలా పరిమితంగా టీటీడీ బోర్డులో సభ్యులను నియమించేది. అప్పుడు… తెలంగాణ నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం కల్పించేవారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాలకు కూడా.. ఒక్కొక్క సభ్యుడికే అవకాశం కల్పించేవారు. అయితే.. ఇప్పుడు మాత్రం.. తెలంగాణ నుంచి… ఏపీతో పోటీగా .. ఏడుగురు చోటు దక్కించుకున్నారు. వీరందరూ.. తెలంగాణ అధికార పార్టీతో అత్యంత సన్నిహితులుగా ఉండేవారే.
కర్ణాటక రమేష్‌శెట్టి, రవినారాయణ, సుధా నారాయణమూర్తికి సభ్యులుగా అవకాశం కల్పించారు. వీరిలో సుధా నారాయణ మూర్తి గత టీటీడీ బోర్డులోనూ సభ్యురాలిగా ఉండేవారు. ఈమె ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి. ఇక తమిళనాడు నుంచి వైద్యనాథన్, శ్రీనివాసన్, డా.నిశ్చిత, కుమారగురుకు అవకాశం కల్పించారు. ఇందులో శ్రీనివాసన్.. ఇండియన్ సిమెంట్స్ చైర్మన్. జగన్ అక్రమాస్తుల కేసుల్లో సహ నిందితుడిగా ఉన్నారు. ఢిల్లీ నుంచి శివశంకరన్, మహరాష్ట్ర నుంచి రాజేష్ శర్మకు చోటు కల్పించారు. టీటీడీ బోర్డులో… ఏపీ వాళ్ల కన్నా… బయట రాష్ట్రాలకు చెందిన వారి ప్రాతిధ్యమే ఎక్కువగా ఉంది.