డ్రగ్స్ కేసు ఇప్పుడు టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో కొత్తకొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయంటున్నారు. విచారణ ప్రక్రియను పురస్కరించుకుని అధికారులు ఆ పేర్లను గోప్యంగా ఉంచుతున్నారు. తప్పు లేదు. కానీ, తప్పు చేసిన వారు భవిష్యత్తును తలచుకుని కుమిలిపోతున్నారు. పరువు పోతుందేమోనని హడలిపోతున్నారు. నిజమే.. వారు అలా ఆలోచించడంలో తప్పు లేదు. ఈ కేసులో పెద్ద తలకాయలున్నాయని తేలుతుండడం, ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ అకున్ సబర్వాల్ సింహస్వప్నంలా మారడడంతో కొందరికి కంటిమీద కునుకు కరవైంది. అధికార వ్యవస్థ పక్కాగా పనిచేస్తోంటే.. ప్రభుత్వం గర్వంగా తలెత్తుకోవాలి. ఇది తన విజయంగా భావించాలి. కానీ, గతానుభవాలను చూస్తుంటే ఎక్కడో తేడా కనిపిస్తున్నట్లుంది. తప్పు చేసిన వారు పెద్ద కుటుంబాల వారు, ఛరిష్మా ఉన్నవారూ కావడంతో కచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడుంటుంది. ఇది ఒక్క తెలంగాణకే పరిమితం కాదు.. ఏపీపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే టాలీవుడ్లో అధికులు ఆంధ్ర ప్రాంతీయులు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తరవాతా రేపైనా టాలీవుడ్ తన వేదికను అమరావతికి మార్చుకుంటుందేమోననే అనుమానాలు పక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉండకపోవు. ఇక్కడ సమస్య అది కానప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తున్న అంశమే. తాజాగా వెల్లడైన ఓ విషయం ఇప్పుడు కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. అంతర్జాతీయ మాఫియా డ్రగ్స్ కేసులో చేయి పెట్టినట్లు విచారణలో నటుడు సుబ్బరాజు చెప్పిన అంశాలు వెల్లడిస్తున్నాయి. మాదక ద్రవ్యాలు వంటి కేసులలో అంతర్జాతీయ స్థాయి హస్తం కచ్చితంగా ఉంటుంది. నైజీరియన్లను ఇలాంటి కేసులో అరెస్టులు చేస్తుండడం దీనికి తార్కాణం. చదువుల కోసమంటూ ఇండియాకు విచ్చేసే ఆఫ్రికన్ విద్యార్థులు ఇక్కడ మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నారు. అదనపు సంపాదనకు అలవాటు పడ్డారు. ఇప్పుడీ కేసును అంతర్జాతీయ మాఫియాపైకి నెట్టేసి, కొందరు ప్రముఖుల్ని తప్పించేసే ప్రయత్నమూ సాగవచ్చు. అంటే చిన్న గీతను మరింత చిన్నది చేయాలంటే దాని పక్కన పెద్ద గీత గీసినట్లన్నమాట. ఇది సర్వత్రా చేసే పని. కాంగ్రెస్ ప్రభుత్వాలకు వెన్నతో పెట్టిన విద్య. చిన్న సమస్యను తీర్చడానికి పెద్ద సమస్యను సృష్టించడం.. తద్వారా రాజకీయ లబ్ధిని పొందడం దానికి అలవాటు. అదే మెళకువను మిగిలిన పార్టీలూ అందిపుచ్చుకున్నాయి. అన్ని భాషలకూ సంస్కృతం ఎలా మాతృక అయ్యిందో.. అలాగే అన్ని పార్టీలకూ కాంగ్రెస్ ఆదర్శమైంది.
డ్రగ్స్ కేసు.. యువత భవితకు సంబంధించింది. దీన్ని చిన్న సమస్యలా చూడరాదు. ఓ నయీం కేసు లాగానో… ఓటుకు నోటు కేసు మాదిరిగానో.. కాల్ మనీ ర్యాకెట్గానో ప్రభుత్వాలు భావించకూడదు. రాజకీయ కశ్మలాన్ని కడిగేయడం ఓటర్ల చేతిలో ఉంది. యువత భవితను నాశనం చేసే డ్రగ్స్ కేసు ప్రభుత్వాల చేతుల్లో ఉంది. విజ్ఞతగా అడుగులేసి, అధికారులకు సహకరిస్తే.. పూర్తిగా కాకపోయినా.. అధిక శాతం నిర్మూలించడం సాధ్యమే.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి