తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా సైడ్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. . ఈ అసహనం బండి సంజయ్ లో కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి పకడ్బందీగా పార్టీని ముందుకు తీసుకెళ్తూంటే బండి సంజయ్ కు బీజేపీని నడపడం సాధ్యం కావడం లేదని వస్తున్న విమర్శలపై ఆయన స్పందించిన తీరు చూసిన వారికి.. బీజేపీకి భవిష్యత్ లేదని ఆయనకూ అర్థమైపోయిందని అనుకుంటారు. తనకు రేవంత్ రెడ్డిలా ఓటర్లను కొనడం రాదని.. చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అంతే కాదు తన హయాంలో గెలిచినవన్నీ ఏకరువు పెట్టి.. రేవంత్ రెడ్డే వరుసగా పార్టని గెలిపించలేకుండా వస్తున్నారని.. ఎవరు గొప్ప అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నల వెనుకే.. తెలంగాణలో బీజేపీ పరిస్థితి గడ్డుగా మారిందని సులువుగా అర్థం చేసుకోవచ్చు.
కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఒక్క సారిగా తిరగబడింది. పార్టీ లోకి వచ్చే వారు కాకుండా పోయేవారిపై చర్చ జరుగుతోంది. మరో వైపు కవిత విషయంలో దర్యాప్తు సంస్థల తీరు .. ఆ రెండు పార్టీలు ఒకటే అనుకునేలా చేశాయి. ఇదే అదనుగా బీజేపీలో ఉక్కపోతుకు గురవుతున్న నేతల విషయంలో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారు. బీజేపీలో చేరిన నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రచారం జరగడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు.
రేవంత్ రెడ్డి టార్గెట్ బీఆర్ఎస్తో కాంగ్రెస్ కు ముఖాముఖి పోరు జరిగేలా చూసుకోవడం . బీజేపీ అసలు రేసులో లేదన్న అభిప్రాయాన్ని కల్పించడం. ఇందు కోసం రేవంత్ అన్ని రకాల ప్లాన్లూ వేస్తున్నారు. ముఖాముఖి పోరు అంటూ జరిగితే అది కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా కన్సాలిడేట్ అయితే అధికార పార్టీకి ఇబ్బందే. బీజేపీ బలంగా ఉండి ఉంటే మూడు పార్టీల మధ్య ఓట్లు చీలిపోయి బీఆర్ఎస్ విజయం సునాయాసం అవుతుంది. కానీ ఇప్పుడు ముఖాముఖి పోరు కోసం .. కర్ణాటక విజయం ఇచ్చిన ఉత్సాహంతో కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఆ దిశగానే వ్యూహాత్మకంగా అడుగులు పడుతున్నాయి.