బసవేంద్ర సూరపనేని
డిట్రాయిట్, USA
తెలంగాణా రాష్ట్ర 3వ సార్వత్రిక ఎన్నికలు వచ్చేసాయి. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయ్యి, తెరాస ప్రభుత్వ పాలనని వెనక్కి తిరిగి చూసుకుంటే సాధించిన కొన్ని విజయాలు, మరెన్నో తప్పిదాలు కనపడుతున్నాయి.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సానుకూల వాతావరణం ఏర్పరచటంలో, కొత్త కంపెనీలని ఆకర్షించే ప్రయత్నం చేయటం నిజంగా అభినందనీయం. అలాగే హైద్రాబాద్ నగరం విశ్వనగరంగా మారి, ఒక ఆటో పైలట్ మోడల్ గా మారి అభివృద్ధి చెందే క్రమంలో ఎలాంటి ప్రతికూల నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడటం, రెండవ విజయం. రాష్ట్రం విడిపోయాక ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్యన ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణం కల్పించడం నిజంగా హర్షణీయం! అందుకు పాలకులను అభినందించి తీరాలి. అదే సమయంలో తెరాస అధినాయకత్వం చేసిన తప్పులు చాలా కనపడుతున్నాయి. ఏ ఆకాంక్షలు, ఆశలు, ఆశయాల ప్రాతిపదికపైన రాష్ట్ర ఏర్పాటు జరిగిందో, అవి సాధించామా అన్న ప్రశ్నకి సరైన సమాధానం దొరకటం లేదు. నీళ్లు, నియామకాలు, నిధులు, వీటన్నింటిలో మాకు స్వావలంబన కావాలి, అందుకే మా తెలంగాణ మాకు కావాలి అని కొట్లాడి సాధించుకున్న తరువాత ఆ లక్ష్యం దిశగా కెసిఆర్ ప్రయాణం సాగించారా?
మన కంటికి కనిపించే అతి పెద్ద ఫెయిల్యూర్ కాళేశ్వరం ప్రాజెక్ట్! కాంగ్రెస్ హయాంలో మొదలయ్యి, కాలువల నిర్మాణం కూడా కొంతవరకు అయిన ప్రాజెక్ట్ డిజైన్ ని, నీటి లభ్యత లేదన్న వాదనతో తుమ్ముడిహట్టి దగ్గర కట్టకుండా మార్చేసి, నీటిపారుదల రంగ నిపుణులు, మేధావులు అందరూ వద్దని హెచ్చరించినా వినకుండా, కెసిఆర్, కేవలం తన ఆలోచన ప్రకారం కట్టిన కాళేశ్వరం రాష్ట్రానికి తలకు మించిన భారం అయ్యి, అప్పుల పాలు అయ్యేలా చేసింది. ఇంతా చేసి ఫలితం ఏమైనా ఉందా అంటే, మొన్న జరిగిన పునాది, పిల్లర్లు కుంగిపోయిన సంఘటన, ప్రాజెక్ట్ మనుగడనే ప్రశ్నగా మార్చింది.
ఈ ప్రాజెక్ట్ నిధులు కొరకు దేశంలో వున్న ప్రముఖ బాంకులన్నింటి దగ్గర అప్పులు తెచ్చారు. వరంగల్ సెంట్రల్ జైలు కూడా 1150 కోట్ల అప్పు కోసం తాకట్టు పెట్టారు అనే వార్తలు వస్తున్నాయి, ఇది ప్రజానీకంలో తీవ్ర చర్చకి దారితీస్తున్నది. ప్రతి విషయం మీద అద్భుతంగా ప్రసంగించే కెసిఆర్, ఎన్నికల సభల్లో ఎక్కడా ఈ కాళేశ్వరం ఊసు కూడా తీసుకొని రావటం లేదు. కాళేశ్వరం ఫెయిల్యూర్ కేవలం లక్ష కోట్ల రూపాయల నష్టం మాత్రమే కాదు! పచ్చని పొలాలు, పాడి పంటల కోసం తెలంగాణా కన్న కోటి కలల విధ్వంసం కూడా! ఇక ఈ ప్రాజెక్ట్ లో భాగంగా కట్టిన మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ వల్ల ఇల్లు, పొలాలు, ఊళ్ళు కోల్పోయిన నిర్వాసితులకు ఏమి చేసారు? సిద్ధిపేట బిడ్డని అని చెప్పుకునే కెసిఆర్ గారు, తను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్ నియోజకవర్గం పరిధిలోని ముంపు గ్రామాల ప్రజల్ని ఎందుకు పోలిసులతో బలవంతం గా ఖాళీ చేయించవలసి వచ్చింది? నిర్వాసితుల పట్ల అమానవీయంగా వ్యవహరించారు అన్న కారణంతో సాక్షాత్తు సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయచంద్ర రెడ్డి ఇద్దరికి, తెలంగాణ హైకోర్ట్ మార్చ్ 10, 2021 న 3,4 నెలలు జైలు శిక్ష విధించిన మాట వాస్తవం కాదా? 70 సంవత్సరాల వృద్ధుడు మల్లారెడ్డి, ప్రాజెక్ట్ వల్ల వున్న ఇల్లు పోయి తెరాస ప్రభుత్వం ఇచ్చిన దిక్కుమాలిన G.O 120 వల్ల, ఉండటానికి ఇల్లు లేక ఆత్మహత్య చేసుకోవటం నిజం కాదా?
ఇక తెలంగాణా ఉద్యమ ప్రధాన ఆశయం, ఉద్యోగ నియామకాల విషయానికి వస్తే , తెరాస ప్రభుత్వం ఎన్నో ఆశలతో వున్న విద్యార్థులనీ , నిరుద్యోగులనీ దారుణంగా నిరాశపరచింది. లక్షలాది యువత TSPSC పేపర్ లీక్ కుంభకోణంతో తీవ్ర నిస్పృహ, నిరాశ, వేదనలకి లోనయ్యారు. బంగారు తెలంగాణాలో భవిష్యత్ మీద ఎన్నో ఆశలతో వున్న వారికి, తెరాస ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, TSPSC నిర్వాకం, TSPSC చైర్మన్, సభ్యుల నిష్క్రియాపరత్వం మీద తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుతున్నది. తెరాస ప్రభుత్వం, 2015 నుండి షుమారుగా 1,91,000 ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయకుండా నిర్లక్ష్యం, తాత్సారం చేసింది అన్న విషయం బయటపెట్టిన 2021 బిస్వాల్ కమిటీ రిపోర్ట్ కి, 30 లక్షల తెలంగాణా నిరుద్యోగ యువత కి ఏమి సమాధానం చెపుతారు? ఏ నిరుద్యోగ యువత, విద్యార్థులు అయితే ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారో, తమ బలిదానాల ద్వారా తెలంగాణా ఆకాంక్షకి ఉద్వేగాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చారో వారికి ఏమి సమాధానం చెపుతారు?
తెలంగాణా ఉద్యమంలో షుమారుగా 1600 వందలమంది బలిదానం చేస్తే, తెలంగాణా వచ్చాక షుమారుగా 1000 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవం కాదా? తమ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లి తండ్రులకి, ప్రభుత్వ వైఖరి వల్ల ఉద్యోగాలు రాక, అవకాశాలు లేక , తల్లితండ్రులకి ఏమి చెప్పాలో తెలియక వత్తిడిలో తనువు చాలించిన పిల్లల సంఘటన ప్రతిరోజూ వింటుంటే ఇదేనా బంగారు తెలంగాణా అన్న ప్రశ్నకి ఏది సమాధానం? తెలంగాణా యువత బతుకు చీకటి చారికల్ని, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ జిలుగు వెలుగులతో కప్పిపుచ్చలేరు!
చరిత్రలో ఏ పౌరసమాజం అయినా అభివృద్ధి చెందింది అంటే సమిష్టి కృషి వల్లే! కుల, మత, ప్రాంతం చూడకుండా నాయకులని తయారు చేస్తూ వచ్చిన వాళ్ళు మహా నాయకులు అయ్యారు! ఢిల్లీ నుండి గల్లీ దాకా కుటుంబ సభ్యులతోనే రాజకీయం నడిపిన వాళ్ళు ఒక కుటుంబ కధలో పాత్రలుగా మాత్రమే మిగిలిపోతారు!
బోడోలాండ్ ఉద్యమ అమర వీరులకి ఆ రాష్ట్రం ఇచ్చిన గౌరవం, అస్సాం రాష్ట్రం లో kokrajhar టౌన్ లో 28 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఆ ఉద్యమంలో చనిపోయిన ప్రతి వారి పేరు మీద ఒక స్మారక చిహ్నం ఉంటుంది. ఝార్ఖండ్ ఉద్యమంలో అసువులు బాసిన ప్రతి గిరిజనుడి కుటుంబ వారసులని కొంత ఆలస్యం అయినా, వెతికి పట్టుకొని మరీ ప్రభుత్వ వుద్యోగం ఇచ్చారు.
ఒక్క పూట అన్నం పెడితే పది కాలాలు గుర్తుంచుకొనే తెలంగాణసమాజంలో, ప్రాణాలు ఇచ్చి వెళ్ళిపోయి, చరిత్ర లో కలిసిపోయిన ఆ అమరవీరులకు హైదరాబాద్లో ముందు తరాలు చూసి గర్వ పడేలా ఒక అద్భుతం అయిన స్మారక చిహ్నం కావాలి! అది కోట్లు ధారపోసి అట్టహాసంగా కట్టిన సెక్రెటరియేట్, దుర్గం చెరువు బ్రిడ్జి, నియాన్ లైట్స్ కంటే వెయ్యి రేట్లు స్ఫూర్తి ఇస్తుంది భావి తరాలకి! ఎవ్వరు ఆపారు కట్టకుండా అని ఆలోచిస్తే తెలంగాణా అమర వీరుల పట్ల కెసిఆర్ ప్రభుత్వంకి వున్న చిన్న చూపు అర్ధం అయ్యి గుండెల్లో కలుక్కుమంటుంది.
ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఉండాల్సిన ముఖ్య లక్షణాలు: సమానత్వం, బాధ్యతతో కూడిన నాయకత్వం, పారదర్శకత, సహనం, అధికార దుర్వినియోగం పైన నియంత్రణ, బహుళ పార్టీ వ్యవస్థ. ఇవి ఏమీ గత 10 సంవత్సరాల పాలనలో ఉండకపోవడం ఒక చారిత్రక విషాదం!
ఈ విషయం ధైర్యంగా చెప్పటానికి, బలమైన వ్యవస్థ పైన మొండిగా పోరాటం చేయడానికి, ఎప్పుడో ఒక్కడు ముందుకు వస్తాడు నిప్పుల దారిలో కొండా కోనల్ని దాటి వస్తాడు ! దశాబ్ధాల ధుర్బేధ్యపు రాజకీయ కొట గోడల్ని బద్దలుకొడతాడు. లక్షలాది తెలంగాణా యువత గుండెల్లో రగులుతున్న ఆకాంక్షకి తాను ఒక్కడే గొంతై ధైర్యంగా నిలబడతాడు. ప్రతికూల పరిస్తితుల్లో కూడా తిరగబడతాడు, కలబడతాడు! ఆ ఒక్కడే రేవంత్ రెడ్డి!!!
గుణగణాల్ని లెక్కిస్తూ, పరిపూర్ణత్వం పేరుతో మీనమేషాలు లెక్కపెట్టకుండా, అప్రజాస్వామిక తెరాస ప్రభుత్వం పై యుద్దానికి కాంగ్రెస్ పార్టీతో పదం కలిపి కదం తొక్కాలి నిస్వార్ధపు తెలంగాణా ప్రేమికులు, వీరులు, మేధావులు అంతా!
silence is connivance,
connivance is betrayal,
betrayal is sin,
sin is punishable offence!
తప్పని తెలిసీ, ఆపగలిగే స్థానంలో ఉండీ, మౌనంగా ఉండటం అంటే పరోక్షంగా అంగీకారం తెలపటమే! అది ద్రోహం, పాపమే కాక నేరం కూడా!
రేపటి సంతోషపు ఉదయాలు ఎప్పుడూ ఉంటాయి, మెళుకవతో వుండి స్వాగతించడమా? లేదా నిశ్శబ్దంగా, నిస్సత్తువతో, నిర్లిప్తంగా పడి ఉండటమా, రెండూ మన చేతుల్లో, చేతల్లోనే ఉంటాయి.
తెలంగాణా సమాజం ఈ కీలకమైన సమయంలో, ఎన్నికల్లో సరి అయిన నిర్ణయం తీసుకొంటుంది అని ఆశిస్తూ ..
బసవేంద్ర సూరపనేని
డిట్రాయిట్, USA