తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ లో జరగడం అనుమానమేనని మేలో జరిగే అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ భావిస్తున్నారు. మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్ చాట్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెల పదో తేదీ లోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే డిసెంబర్ లో జరుగుతాయని లేకపోతే పార్లమెంట్ తో పాటు ఏప్రిల్ , మేలో జరుగుతాయన్నారు. అక్టోబర్లో షెడ్యూల్ రావడం అనుమానంగానే ఉందన్నారు. ఏదైనా పార్లమెంట్ సమావేశాల్లో స్పష్టత వస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికలకు భయపడుతున్నారని కేటీఆర్ అన్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై ఉంటుందనుకుంటున్నారని అందుకే జమిలీ ఎన్నికల పేరుతో ఆలస్యం చేయాలనుకుంటున్నారని కేటీఆర్ చెబుతున్నారు. ఇటీవలి కాలంలో జమిలీ ఎన్నికలపై విస్తృత చర్చ జరుగుతోంది. కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తోంది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని కూడా నియమించారు. ఆ కమిటీ విస్తృత సంప్రదింపులు జరుపుతోంది. కానీ కమిటీ ఎప్పటిలోపు నివేదిక ఇస్తుందో స్పష్టత లేదు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లు పెడతారా లేదా అన్నదానిపై ఇంకా కేంద్రం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. తెలంగాణ ప్రభుత్వ పదవీ కాలం జనవరితో ముగిసిపోతుంది.
ఆ తర్వాత ఆపద్ధర్మంగా కూడా కొనసాగే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎన్నికలు జరగలేదు కాబట్టి.. ప్రజా ప్రతినిదులే ఉండరు. రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుంది. కనీసం ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్నా… అధికారంలో ఉన్నట్లుగా ఉంటుంది కానీ.. రాష్ట్రపతి పాలనలో అంతా గవర్నర్ చూసుకుంటారు. ఇక్కడే కీలక పరిణామాలకు కారణం అయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.