హైదరాబాద్: మంగళవారం వరంగల్ జిల్లా తాడ్వాయి అడవుల్లో శృతి అలియాస్ మైసక్క, విద్యాసాగర్ రెడ్డి అలియాస్ గోపన్న అనే ఇద్దరు మావోయిస్టులను పోలీసులు ఎన్కౌంటర్లో కాల్చిచంపిన ఘటన తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎదురుకాల్పులకు ముందు శృతిని యాసిడ్తో గాయపరిచినట్లు, ఆమెపై అత్యాచారం జరిగినట్లు… కొత్త కోణాలు వెలుగులోకొస్తున్నాయి. మావోయిస్టుల కార్యకలాపాలు తెలంగాణలో పెరిగిందనటానికి ఈ ఎన్కౌంటర్ నిదర్శనంగా నిలుస్తుండగా, పోలీసులు మాత్రం ఆ వాదనను కొట్టిపారేస్తున్నారు. శృతి, విద్యాసాగర్లను పోలీసులు అతి కిరాతకంగా చిత్రహింసలు పెట్టి కాల్చిచంపారని మృతుల కుటుంబ సభ్యులు, వరవరరావువంటి ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తుండగా, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకులుకూడా ఆ ఆరోపణలను సమర్థిస్తున్నారు.
వరంగల్లో జరిగిన ఎన్కౌంటర్ బూటకమని, దానిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు మాజీ నక్సలైట్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ, మావోయిస్ట్ శృతిని పోలీసులు అత్యాచారం చేసి చంపేశారని ఆరోపించారు. నక్సలైట్ల ఎజెండాయే తమ ఎజెండా అంటూ అధికారంలోకొచ్చిన కేసీఆర్ ఇప్పుడు బూటకపు ఎన్కౌంటర్లు చేయిస్తున్నారని మండిపడ్డారు. బతుకమ్మతో ఊరూరా తిరిగిన టీఆర్ఎస్ ఎంపీ కవిత ఓసారి శృతి మృతదేహాన్ని పరిశీలించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని నెత్తికెత్తుకున్న నక్సలైట్లను కేసీఆర్ సర్కార్ దారుణంగా ఎన్కౌంటర్ చేయించిందని టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి అన్నారు.
పోలీసులు అవునన్నా, కాదన్నా ఉత్తర తెలంగాణలో మావోయిస్ట్ కార్యకలాపాలు పెరిగిన మాట వాస్తవమేనని అభిజ్ఞవర్గాల సమాచారం. అందుకే పోలీసులు ఇటీవల ముఖ్యమంత్రి భద్రతను పటిష్ఠం చేశారని చెబుతున్నారు. దానికితోడు ఇటీవల మావోయిస్ట్ నేతలు కేసీఆర్ ప్రభుత్వానికి కొన్ని బహిరంగ లేఖలు రాసిన విషయం అందరికీ తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వం రైతు ఆత్యహత్యలకు ప్రాధాన్యం ఇవ్వకుండా అనవసరమైన విషయాలపై ఖర్చు పెడుతోందని, యాదగిరిగుట్ట అభివృద్ధికి రు.100 కోట్లు కేటాయించటం అలాంటిదేనంటూ ఆ లేఖలలో ఆరోపణలు చేశారు. ఏది ఏమైనా ఈ ఎన్కౌంటర్ ఊరికే పోదనిమాత్రం తెలుస్తోంది. మావోయిస్టులు తమ కార్యకలాపాలను మరింత తీవ్రంచేసే అవకాశాలు కనబడుతున్నాయి.