బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు రెండురోజుల ముందు నుంచే బీజేపీ నేతలు తెలంగాణ దండయాత్ర చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల నేతలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగుతున్నారు. నేరుగా వారు హైదరాబాద్ రావడం లేదు. తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్తున్నారు. రెండు రోజుల ముందుగానే వారికి షెడ్యూల్ ఇచ్చారు. పార్టీ బలోపేతం కోసం జిల్లాల్లో పర్యటించాలని ఆదేశించారు. ఆ మేరకు వారు వస్తున్నారు. జిల్లాలో బీజేపీ నేతలు వారికి ఘన స్వాగతం పలికి తీసుకెళ్లి.. ర్యాలీలు చేసి.. బల ప్రదర్శన చేస్తున్నారు
దాదాపుగా మార్క్ చేసుకున్న ప్రతి నియోజకవర్గానికి నేతలు వెళ్తున్నారు. అది కూడా సమీకరణాలు చూసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రభావితం చేయగలిగే నేతల్ని పంపుతున్నారు. ఇతర రాష్ట్రాల వారు ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా నివాసం ఉంటే.. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే బీజేపీ నేతల్ని అక్కడకు పంపుతున్నారు. రెండు రోజుల పాటు ఈ వ్యవహారం జరుగనుంది. గురువారమే అనేక నియోజకవర్గాలకు నేతలు చేరుకున్నారు. శుక్రవారం మరింత మరింతమంది ర్యాలీలు చేయనున్నారు. రెండు, మూడు తేదీల్లో జాతీయకార్యవర్గ భేటీలు జరుగుతాయి.
ఎక్కడ చూసినా బీజేపీనే కనిపించాలన్న లక్ష్యంతో ఈ ప్రచారానికి రూపకల్పన చేశారు . హైకమాండ్ ఆదేశించడమే ఆలస్యం.. పార్టీ నేతలంతా పోలోమని వస్తారు కాబట్టి ఈ విషయంలో బీజేపీ పటాలానికి లోటు లేదు. దీంతో తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పుడు… ర్యాలీలు తీయడంలో బలప్రదర్శన ఏర్పాటు చేయడంలో బిజీగా ఉన్నారు.