తెలంగాణ సర్కార్.. రైతులకు 28 నుంచి రైతు బంధు నిధులు జమ చేయాలని నిర్ణయించుకుంది. గతంలో చెక్కులు పంపిణీ చేస్తూ పండగలా ఈ పథకాన్ని అమలు చేసేవారు. కానీ కొన్నాళ్లుగా నగదు బదిలీ చేస్తున్నారు. దీనికి కారణం నిధుల కొరతే. పూర్తిస్థాయిలో నిధులు అందుబాటులో ఉండటం లేదు. ఈ కారణంగా వచ్చినంతగా విడతల వారీగా జమ చేస్తున్నారు. ముందుగా ఎకరం ఉన్న రైతులకు ఇస్తారు. ఆ తర్వాత ఎక్కువ ఎకరాలు ఉన్న వారికి ఇస్తారు. భూస్వాములకు ఇచ్చినా ఇవ్వకపోయినా వారు నోరు మెదపలేరు. అందుకే ముందుగా చిన్న రైతులకు ఇస్తున్నారు.
ఈ సీజన్లో సుమారు 66 లక్షల మంది రైతుల కోసం రూ.7,600 కోట్ల నిధులు పంపిణీ చేయాల్సి ఉంది. వానకాలంలో 64.99 లక్షల మంది రైతులకు రూ.7,433.13 కోట్ల నిధులను రైతుబంధు కింద పంపిణీ చేసింది. అయితే ఈసారి 66 లక్షల మంది రైతులు అర్హులయ్యే అవకాశమున్నదని, వారికి రైతుబంధు పంపిణీ కోసం రూ.7,600 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. అంటే గత సీజన్‌తో పోల్చితే రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.200 కోట్లు అదనంగా ఇవ్వాల్సి ఉంది.
నిధుల కొరత కారణంగా పథకం ఆలస్యం అవుతూ వస్తోంది. గతంలో నవంబర్లోనే ఇచ్చేవారు. ఇప్పుడు అది డిసెంబర్ నెలాఖరు అయింది. ప్రతీ సారి పంట సీజన్ ప్రారంభమయ్యే ముదే ఇస్తామని చెబుతారు. కానీ ఎప్పుడూ అలా ఇవ్వలేకపోతున్నారు. కేంద్రం ఈ ఏడాది అప్పుల పరిమితిని పూర్తిగా నియంత్రించడంతో కేసీఆర్ సర్కార్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. అది అభివృద్ధి పనులపైనా.. పథకాలపైనా చూపెడుతోంది. ఇప్పటికైతే.. నెలాఖరు నుంచి షెడ్యూల్ ఇచ్చారు. నిధుల సమీకరణ పూర్తికాకపోతే.. పథకం అమలుకు అందుబాటులో ఉన్న నిధులు జమ చేసి.. ఉద్యోగుల జీతాలు ఆలస్యం చేసే అవకాశాలున్నాయి.