తెలంగాణ రాష్ట్ర సమితికి ఏదీ కలిసి రావడం లేదు. దుబ్బాకలో కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారన్న ప్రచారం ఓ వైపు సాగుతూండగానే.. హైదరాబాద్లో తమ నేతల చేతివాటంతో ప్రజాగ్రహాన్ని చవి చూడాల్సి వస్తోంది. వరదల కారణంగా ఇబ్బంది పడిన కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఒక్కో కుటుంబానికి రూ. పదివేలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు పంపిణీ కూడా ప్రారంభమయింది. వీలైనంత త్వరగా ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేయడంతో .. టీఆర్ఎస్ స్థానిక నేతల ప్రమేయం ఎక్కువగా ఉంది. అది అవినీతికి కారణం అయింది. అనేక బస్తీలలో ఎలాంటి ఆర్థి సాయం అందకపోగా… అరకొరగా అందిన చోట… టీఆర్ఎస్ సానుభూతిపరులన్న కుటుంబాలకే సాయం చేశారు.
దీంతో ఓ బస్తీలో వంద కుటుంబాలు ఉంటే.. పది కుటుంబాలే సాయం పొందాయి. మిగతా 90 కుటుంబాలు ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యాయి. ఆ పది కుటుంబాలైనా ప్రభుత్వంపై సానుభూతితో ఉన్నాయా అంటే అదీ లేదు. వారికి రూ. పదివేల సాయం పేరుతో… ఇచ్చింది రూ. ఐదు వేలు మాత్రమే. కొన్ని చోట్ల ఇంకా తక్కువ ఇచ్చారు. స్థానిక నేతలందరూ తమ తమ వాటాలు పంచుకోవడంతో ఆ సాయం చిక్కిపోయింది. చివరికి ఆ సాయం వ్యవహారం మొత్తం ప్రహసనంగా మారిపోయింది. ఎక్కడికక్కడ జనం నిలదీస్తూండటంతో ప్రభుత్వంలోనూ కలవరం ప్రారంభమయింది. వెంటనే… సాయం అందచేసే ప్రక్రియను నిలిపివేయాలని నిర్ణయించారు.
పక్కాగా.. రికార్డులు సేకరించి.. బాధితులకు పరిహారం అందించాలని భావిస్తున్నారు. అయితే పరిస్థితి ఇప్పటికే చేయిదాటిపోయింది. ప్రభుత్వం తమను ఆనేక విధాలుగా వంచించిందని.. ఇప్పుడు వరద సాయం పేరుతోనూ అదే పని చేశారన్న అభిప్రాయం బస్తీ వాసుల్లో ఏర్పడింది. గ్రేటర్ ఎన్నికలకు ముందు ప్రజల్లో సానుకూలత పెంచుకునేందుకు కేసీఆర్ వేసిన సాయం ప్లాన్.. ఇలా దారి తప్పిందనే ఆందోళన టీఆర్ఎస్లో కనిపిస్తోంది.