కాంగ్రెస్ ముక్త తెలంగాణ కోసం అధికార పార్టీ తెరాస పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే! సీఎల్పీ విలీన ప్రక్రియలో భాగంగా తెరాసకి కావాల్సిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం కోసం తీవ్రంగా కసరత్తు జరుగుతోంది. దీంతో పార్టీ ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు టి. కాంగ్రెస్ ఎంత ప్రయత్నిస్తున్నా… వెళ్లేవారి జాబితా పెరుగుతూనే ఉంది. తాజాగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి కాంగ్రెస్ ను వీడుతున్నారు. ఆయన చెప్పిన కారణం ఏంటంటే… ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికే తెరాసలో చేరుతున్నారట! ముఖ్యమంత్రి కలిసి పనిచేస్తేనే తన నియోజక వర్గం అభివృద్ధి చెందుతుందనీ, తన ప్రాంత ప్రజల కోసం కాంగ్రెస్ నుంచి వచ్చిన పదవులన్నీ వదులుకుంటానని ప్రకటించారు. కేటీఆర్ తో భేటీ అనంతరం గండ్ర ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన్ని బుజ్జగించడం కోసం కాంగ్రెస్ పెద్దలు బాగానే ప్రయత్నించారు. గండ్ర దంపతులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది.
గండ్ర రాజీనామాతో వలస నేతల సంఖ్య 11కి చేరింది. ఇప్పుడు తెరాసకు ఇంకో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావాల్సి ఉంది! సీఎల్పీని తెరాస ఎల్పీలో విలీనం చేస్తూ స్పీకర్ కు ఇవ్వాల్సిన లేఖలో 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలు ఉండాలి. వాస్తవానికి, ఈ సంతకాల ప్రక్రియ ఆదివారం నాడే ప్రారంభమైంది. ఇటీవల వలస వచ్చిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వచ్చి స్పీకర్ కి ఇవ్వాల్సిన పత్రంపై సంతకాలు పెట్టడం ప్రారంభించారు. మంగళవారం నాటికే సంతకాల సేకరణ ప్రక్రియ పూర్తవ్వాలని, స్పీకర్ కి లేఖ ఇచ్చేయాలని తెరాస భావించింది. కానీ, ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేల రాకపై కొంత స్పష్టత రావాల్సి ఉంది. కాబట్టి, సీఎల్పీ విలీన ప్రక్రియ కాస్త ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారమంతా తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో జరుగుతోంది. గండ్ర రాజీనామా చేశారు కాబట్టి, ఇప్పుడు మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షించే పనిలో ఆయన ఉన్నట్టు తెరాస వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పుడు 11 మంది పార్టీకి దూరమయ్యారు. మరో ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో… మిగులున్న ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నేతలు టచ్ లో ఉంటున్నారట! సీఎల్పీ విలీనానికి అవకాశం లేకుండా చేయాలన్న పట్టుదలతో కాంగ్రెస్ నేతలున్నారు. కనీసం ఇప్పుడైనా పట్టు నిలుపుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందో లేదో చూడాలి. ఆ మరో ఇద్దర్ని ఆపగలిగితే మంచిదే!