శ్రీశైలం ప్రాజెక్టులోకి ఈ ఏడాది సీజన్లో వరద ప్రారంభమయింది. ఓ మాదిరిగా వరద వస్తోంది. కానీ.. రాయలసీమకు మాత్రం ఇంత వరకూ నీరు విడుదల కాలేదు. దీనికి కారణం .. తెలంగాణ సర్కార్.. విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. దిగువకు వదిలేస్తోంది. నిజానికి.. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చే వరకూ విద్యుత్ ఉత్పత్తి చేయకూడదు. కానీ వరద వచ్చీ రాగానే.., తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేసింది. దీన్ని ఏపీ సర్కార్ పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో డ్యాం ఖాళీ అయిపోతోంది. ఇప్పటి వరకూ ఏకంగా పదిహేను నుంచి ఇరవై టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి ద్వారా తెలంగాణ ఉపయోగించుకుంది.
జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 854 అడుగుల వద్ద ఉంది. 85 టీఎంసీల నీరు ఉంది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. దీంతో… వచ్చిన వరద వచ్చినట్లుగా దిగువకు పోతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు చేరితేనే సీమకు నీరు విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. వరద ప్రారంభమైన సమయంలో.. వారంలో శ్రీశైలం నీటి మట్టం నీటిని తోడుకునేంత స్థాయికి వస్తుందని.. రాయలసీమ ప్రాజెక్టులకు నీటి సరఫరా చేయొచ్చని అధికారులు అనుకున్నారు. కానీ.. వరద వస్తున్నా.. నీటి మట్టం.. పెరగలేదు. దాంతో రాయలసీమకు ప్రభుత్వం నీటిని విడుదల చేయలేకపోయింది. ఇప్పటి వరకు రాయలసీమ రైతాంగానికి అందాల్సిన దాదాపు 10 టీఎంసీలను తెలంగాణ రాష్ట్రం వాడుకుంటోందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా.. తెలంగాణ ఇలా వాడుకుంటోందని.. కృష్ణా బోర్డుకు లేఖలు రాసి సరి పెడుతుందే కానీ.. తదుపరి కార్యాచరణ చేపట్టడం లేదు. పట్టిసీమ ద్వారా.. డెల్టా అవసరాలు తీరుస్తూ… శ్రీశైలంకి వచ్చే నీటిని .., రాయలసీమకు ఇవ్వాలని గత ప్రభుత్వం ప్లాన్ చేసింది. తెలంగాణ సర్కార్ కృష్ణా బోర్డు చెప్పినట్లు వినేలా.. నిబంధనలు ఉల్లంఘించకుండా.. జాగ్రత్తలు తీసుకుంది.కానీ ఇప్పుడు ప్రభుత్వం… తెలంగాణ సర్కార్.. నిబధనలు ఉల్లంఘిస్తోందని.. ఫిర్యాదులు చేసి సైలెంటవుతోంది. ఫలితంగా.. రాయలసీమకు నీటి కొరత ఏర్పడే ప్రమాదం వచ్చింది. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది.