దుబ్బాక పోరు ముగిసింది. ఇక మిని అసెంబ్లీ ఎన్నికల తరహాలో పోటీ పడే.. గ్రేటర్ ఎన్నికల హంగామా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. గ్రేటర్ ఓటర్ల జాబితాకు ఓ రూపం ఇచ్చే ప్రక్రియను తెలంగాణ ఎస్ఈసీ ప్రారంభించింది. పదమూడో తేదీతో ఓటర్ల జాబితా సిద్ధమవుతుంది. ఆ తర్వాత ఏ క్షణమైనా గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటిస్తామని ఎస్ఈసీ పార్థసారధి ప్రకటించారు. ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత.. షెడ్యూల్‌కు అక్కడ గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గ్రేటర్ ఎన్నికల ప్రక్రియను నామినేషన్ల దగ్గర్నుంచి కౌంటింగ్ వరకూ.. వీలైనంత తక్కువ వ్యవధిలో అంటే.. రెండు వారాల వ్యవధిలో పూర్తి చేసే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.
దుబ్బాక ఎన్నికల్లో వచ్చే ఫలితం కూడా గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్‌పై ప్రభావం చూపించవచ్చన్న అంచనా రాజకీయ పార్టీల్లో ఉంది. ఎప్పుడూ లేని విధంగా దుబ్బాకలో బీజేపీకి కాస్త పాజిటివ్ వేవ్ కనిపించింది. టీఆర్ఎస్ కూడా.. బీజేపీనేప్రధాన ప్రత్యర్థిగా భావించింది. ఇక గ్రేటర్లో బీజేపీ సహజంగానే కాస్త బలంగా ఉంది. గతంలో ఓ సందర్భంలో కేసీఆర్ కూడా.. గ్రేటర్లో బీజేపీ బలపడిందని.. గతంలో కంటే ఒకటి , రెండు సీట్లు ఎక్కువగా గెల్చుకుంటుందని చెప్పారు. ఇది ఆ పార్టీకి పాజిటివ్‌గా మారింది. కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి.. గ్రేటర్ పోరును ఇజ్జత్ కా సవాల్‌గా తీసుకుంటారు. దాంతో.. పోరు రసవత్తరంగా ఉంటుంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే.. తమ దృష్టి గ్రేటర్ పై పెట్టామని ప్రకటించారు. టీఆర్ఎస్ తరపున గ్రేటర్ బాధ్యతలు తీసుకున్న కేటీఆర్.. అభివృద్ధి కార్యక్రమాలు.. డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవంతో సుడిగాలిలా చుట్టేస్తున్నారు. వీలైనంత త్వరగా ఎన్నికలు పూర్తి చేసి.. టీఆర్ఎస్ పట్టు తగ్గలేదని నిరూపించాలని కేటీఆర్ భావిస్తున్నారు. అయితే.. దుబ్బాకలో వ్యతిరేక ఫలితం వస్తే మాత్రం.. ఆ ఎఫెక్ట్ గ్రేటర్‌పై పడుతుంది. సానుకూల ఫలితం వస్తే.. మాత్రం తిరుగుండదు. అందుకే.. గ్రేటర్ ఫలితం ఆధారంగా గ్రేటర్ ఎన్నికల తేదీలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.