జబర్దస్త్‌తో పాపులర్ అయ్యాడు ముక్కు అవినాష్. బిగ్ బాస్ షోలో అడుగుపెట్టి మరింత ఆదరణ సంపాదించాడు. ఇప్పుడు తన వ్యవహారం సోషల్ మీడియాలో విమర్శలకు తావిస్తోంది. ఇటీవల ముక్కు అవినాష్ తల్లి లక్ష్మీ రాజం అనారోగ్యానికి గురైంది. ఆమె ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం 60 వేల ఆర్థిక సహాయాన్ని అందించింది. అందుకు సంబంధించిన చెక్కుని తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్.. అవినాష్‌కి ఇవ్వడం, ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చక చక జరిగిపోయాయి.
ప్రభుత్వం.. వైద్య సహాయం కోసం 60 వేలు అందించడం తప్పు కాదు. కానీ అదెవరికి అనేది ప్రధానం. అవినాష్ ఏమీ తిండికి గతిలేనివాడు కాదు. కటిక పేదరికంలో లేడు. 60 వేలు తనకు పెద్ద కష్టమైన విషయం కాదు. ఒక్క షో లో పాల్గొంటే 50 వేలు సంపాదించుకోగలడు. అలాంటిది తల్లికి 60 వేలతో వైద్యం చేయించుకోలేడా? ఆ సహాయం కూడా ప్రభుత్వం అందించాలా? ప్రభుత్వాలు కూడా ఎవరికి సహాయం చేస్తున్నాం? వాళ్లు సహాయం పొందడానికి అర్హులా, కాదా? అనే విషయాన్ని పట్టించుకోదా? ఆ అరవై వేలు… నిరుపేదలకు అందిస్తే… ఇంకా బాగుండేది కదా.? సహాయం అందాల్సింది సామాన్యులకే తప్ప, సెలబ్రెటీలకు కాదు. దాంతో ఈ వ్యవహారంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తుతున్నారు. అమ్మకు ఆర్థిక సహాయం అందుకుంటూ…అవినాష్ అవార్డు తెచ్చుకున్నట్టు ఫోజు ఇస్తున్నాడేంటి? అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి వ్యవహారాలలో ప్రభుత్వాలు ఆలోచించుకోవడం మంచిది.