తెలంగాణ తల్లి రూపానికి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఓ రూపం ఇచ్చింది. ప్రతిమను రెడీ చేసింది. ఆవిష్కరణకు సిద్ధం చేశారు. అంతా అయిపోయిన తర్వాత రూపాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ముందుగానే చర్చ పెడితే రచ్చ అవడం తప్ప ప్రయోజనం ఉండదని రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుగానే సిద్ధం చేయించారు. ఆ రూపంపై బీఆర్ఎస్ ఎలాగూ వ్యతిరేకత చూపిస్తుంది కానీ.. సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారన్నదే కీలకం.
తెలంగాణ తల్లి విగ్రహం విషంయలో సామాన్యుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రతి తెలంగాణ గ్రామీణ మహిళ ఆ విగ్రహంలో తమను తాము చూసుకునేలా ఆ రూపం ఉందని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఇలాంటి విగ్రహాలు.. ప్రతిమలను కిరీటాలు, నగలతో దేవతలా చూపిస్తారు. దేవుళ్లలాగా ఉంటుంది అందుకే మానసికంగా దగ్గర కాదు. కానీ ఈ సారి రేవంత్ రెడ్డి ఆలోచన మాత్రం .. తెలంగాణతల్లి విగ్రహాన్ని దగ్గర చేస్తుంది. తమ కుటుంబసభ్యురాలే తెలంగాణ తల్లి అని అనుకునేలా విగ్రహాన్ని సిద్ధం చేశారు. సామాన్యుల్లో వస్తున్న ఈ స్పందన రేవంత్ రెడ్డి విజయం అనుకోవచ్చు.
బీఆర్ఎస్ ఈ విగ్రహ రూపాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. బోనం లేదని.. బతుకమ్మ లేదని.. సిరిసంపదలు లేవని ఇలా రకరకాలుగా వాదిస్తారు. నిజానికి తెలంగాణ తల్లి విగ్రహానికి పార్టీ పరంగా రూపు ఇచ్చి .. పార్టీ ఆఫీసులో పెట్టుకున్నారు కానీ అధికారికంగా ఎప్పుడూ గుర్తించలేదు. గుర్తించి .. ఆ విగ్రహాన్ని సెక్రటేరియట్ నిర్మాణంతో పాటు పెట్టేసి ఉంటే ఈ రోజు రేవంత్ రెడ్డి దాన్ని మార్చేందుకు ప్రయత్నించేవారు కాకపోవచ్చు. తెలంగాణ తల్లి రూపు అధికారికంగా లేదు.. అందుకే ఇక్కడ రేవంత్ మార్చలేదు. తెలంగాణ తల్లికి ఓ రూపం ఇచ్చి సగర్వంగా ప్రతిష్ఠిస్తున్నారు.