సాధారణంగా ఎగువ రాష్ట్రాలపై దిగువ రాష్ట్రాలు కోర్టుకెళ్తాయి. ఎందుకంటే కిందకు నీళ్లు రాకుండా ప్రాజెక్టులు కట్టుకుంటున్నారని ఫిర్యాదులు చేస్తాయి. ఇప్పటి వరకూ ఉన్న కేసులు అలాంటివే. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం దిగువ రాష్ట్రం ప్రాజెక్టులు కట్టేసుకుంటోందని.. సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్న నీటిని తోడేసుకునే ప్రాజెక్టుకు అయితే కేటాయింపులు లేకపోతే అభ్యంతరం చెప్పవచ్చు. కానీ సముద్రంలోకి పోయే నీటిని మళ్లించుకున్నా సరే.. అభ్యంతరం చెప్పాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది.
ఏపీ ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న బనకచర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లారని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. రాయలసీమ ఎత్తిపోతలతో పాటు బనకచర్ల విషయంలోనూ న్యాయపోరాటం చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రాయలసీమ ఎత్తిపోతలపై సరైన విధంగా నిర్ణయాలు తీసుకోకపోవడం.. కాంట్రాక్టులు ఇచ్చేందుకు తొందరపడటంతో ఎప్పుడో న్యాయవివాదాల్లో చిక్కుకుంది. జగన్ హయాంలోనే ఆగిపోయింది.
రాయలసీమ ఎత్తిపోతలకు..బనకచర్లకు చాలా తేడా ఉంది. బనకచర్లను పోలవరం బేస్ గా చేసుకుని నిర్మిస్తున్నారు. గోదావరి నీటిని రాయలసీమకు తరలించేందుకు కట్టాలని చంద్రబాబు అనుకుంటున్నారు. ఇది గేమ్ ఛేంజర్ అని ఆయన అభిప్రాయం. పూర్తిగా వరద నీటిని మళ్లించుకునే ప్రాజెక్టు. అంటే.. పైన నిల్వ చేసుకోగలిగినంత నిల్వ చేసుకున్న తర్వాత సముద్రంలోకి పోయే ముందు వాటిని ఏపీ ప్రభుత్వం బనకచర్ల ద్వారా సీమకు తరలించే ప్రయత్నం చేస్తోంది. దీని వల్ల తెలంగాణకు చుక్క నీరు నష్టం ఉండదు.
రాజకీయకారణాలతో ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తే తెలంగాణలో ఓ పార్టీ విమర్శలు చేస్తోందని.. ప్రజల్లోసెంటిమెంట్ పెంచేలా చేస్తోందని..దాంతో ప్రస్తుత ప్రభుత్వానికీ తప్పడం లేదని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.