హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి విషయంలో ప్రభుత్వం మాట మార్చింది. అఫ్జల్‌గంజ్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌ను కూలగొట్టే ఆలోచనేదీ తమకు లేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. సాంస్కృతిక వారసత్వ సంపదలోని భాగమైన ఉస్మానియా ఆసుపత్రిని కూల్చబోతున్నారంటూ వస్తున్న వార్తలలో, ఆరోపణలలో నిజమెంతో వెల్లడించాలంటూ హైదరాబాద్‌కు చెందిన స్వామిదాస్ అనే న్యాయవాది హైకోర్ట్‌లో దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్రప్రభుత్వం ఈ విధంగా స్పందించింది. ఆ భవనం హెరిటేజ్ భవనం కిందికి వస్తున్నందును దానిపై తీసుకునే ఏ నిర్ణయమైనా ప్రజలకు ముందుగా తెలపాలని హైకోర్ట్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పడగొట్టటంమాట అటుంచి, ఆ భవనాన్ని పునరుద్ధరించాలన్నా హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీలనుంచి, అధికారులనుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని హైకోర్ట్ ధర్మాసనం ప్రభుత్వం తరపున వాదించిన తెలంగాణ ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావుకు సూచించింది. భవనాన్ని కూల్చే ప్రతిపాదనేది లేదని రామచంద్రరావు కోర్టుకు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ హామీని నమోదు చేసుకుని పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
ఇటీవల ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ భవనాన్ని కూలగొట్టి అక్కడ పది అంతస్తులతో బ్రహ్మాండమైన భవనాన్ని నిర్మిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను వేరే చోటకు తరలించటంకూడా ప్రారంభించారు. కేసీఆర్ నిర్ణయంపై ఒక్కసారిగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. అయితే తాజా పరిణామంతో ఉస్మానియా ఆసుపత్రిని కూల్చటానికి వ్యతిరేకంగా ఉద్యమించిన వివిధ పార్టీలవారు, సాంస్కృతిక పరిరక్షణవాదులు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు.