హైదరాబాద్: అబ్దుల్ కలామ్ మృతికి సంతాపంగా కేంద్ర ప్రభుత్వం వారంరోజులు సంతాపదినాలుగా ప్రకటించింది. ప్రొటోకాల్ ప్రకారం సాధారణంగా ఈ సంప్రదాయాన్ని పదవిలో ఉన్న రాష్ట్రపతిగానీ, ప్రధానమంత్రిగానీ మరణిస్తేనే పాటిస్తారు. కానీ కలామ్పైనున్న గౌరవంమేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వారంరోజులు సంతాపదినాలుగా ప్రకటించింది. ఈ వారంరోజులూ జాతీయపతాకాన్ని అవనతం చేస్తారు. అయితే సెలవుమాత్రం ఇవ్వలేదు. తాను చనిపోతే సెలవు ప్రకటించొద్దని కలామ్ గతంలో చేసిన అభ్యర్థనమేరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ విషయాన్ని స్పష్టీకరించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ మామూలుగానే పనిచేస్తాయని ప్రకటించింది. పలు రాష్ట్రప్రభుత్వాలుకూడా దీనిని పాటించాయి. కానీ తెలంగాణలోమాత్రం ఇవాళ సెలవును ప్రకటించేశారు. బహుశా కలామ్ అభ్యర్థన విషయం మన ప్రభుత్వాధినేతలకు తెలియక గౌరవపూర్వకంగా ప్రకటించిఉండొచ్చు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుమాత్రం కలామ్ ఈ విషయాన్ని తనతోకూడా చెప్పారని, తాను చనిపోతే మరోరోజు అదనంగా పనిచేయాలనికూడా అన్నారని చెప్పుకొచ్చారు. మరోరోజు అదనంగా చేసేటంత దేశభక్తి ఎవరికి ఉంటుందిలేగానీ ఈరోజు ఆయనను తలుచుకుంటా బాగా పనిచేస్తే చాలు.