సంధ్య ధియేటర్ దుర్ఘటన తరవాత చిత్రసీమపై సీత కన్నేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు, ప్రీమియర్ షోలకు అనుమతులు అవ్వడం లేదు. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిందే. ఇలాంటి మరో అపశృతి దొర్లితే, అది ప్రభుత్వానికే ఇబ్బంది. అందుకే ఎలాంటి పొరపాట్లకూ తావు ఇవ్వకూడదని రేవంత్ సర్కారు భావిస్తోంది.
స్టార్ హీరోల సినిమాలకు అనుమతులు ఇస్తే క్రౌడ్ కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. కానీ… మీడియం రేంజ్ సినిమాలకూ ఇదే పరిస్థితి. వచ్చేవారం విడుదల కానున్న ఓ మీడియం సినిమా ఈవెంట్ కోసం చిత్రబృందం పోలీసుల్ని సంప్రదిస్తే, అనుమతులు ఇవ్వడానికి నిరాకరించారు. దాంతో.. ఈవెంట్ కాన్సిల్ అయ్యింది. దాదాపుగా అన్ని సినిమాలకూ ఇదే పరిస్థితి. హైదరాబాద్ లో ఈవెంట్ చేస్తే వచ్చే మైలేజీ మిగిలిన చోట్ల చేస్తుంటే రావడం లేదు. దాంతో నిర్మాతలకు కూడా ఏం చేయాలో పాలు పోవడం లేదు. ప్రీమియర్ షోలకు అనుమతులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు, కనీసం ఈవెంట్లయినా చేసుకోనివ్వండని ప్రాధేయపడుతున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే.. కొన్ని ఏరియాల్లో షూటింగ్ చేసుకోవడానికి సైతం పర్మిషన్లు రావడం లేదు. అవుడ్డోర్ చిత్రీకరణలు కష్టం అవుతున్నాయి. దాంతో.. బెంగళూరు, ముంబై అంటూ పక్క రాష్ట్రాలకు పరుగులు పెడుతోంది చిత్రసీమ. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే తెలంగాణలో షూటింగ్ అంటే నిర్మాతలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఫిల్మ్ నగర్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రీమియర్ షోలకు, టికెట్లు పెంచుకోవడానికీ అనుమతులు రాకపోయినా ఫర్వాలేదు, కనీసం ప్రీ రిలీజ్ ఫంక్షన్లకూ, షూటింగులకు పర్మిషన్లు ఇవ్వాలని నిర్మాతలు కోరుకొంటున్నారు.