హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా-ఈ కార్ల రేస్ రద్దయింది. ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రేసింగ్ సంస్థ ప్రకటించింది. వెంటనే కేటీఆర్ ప్రభుత్వాన్ని నిందిస్తూ ట్వీట్ చేశారు. కానీ లోతుల్లోకి వెళ్తే ఈ ఫార్ములా ఈ రేసు పేరుతో ప్రజాధనాన్ని అడ్డగోలుగా ఖర్చు చేయడంతో పాటు… ధనవంతుల విలాసాల కోసంప్రజల్ని ట్రాఫిక్ టార్చర్ కు గురి చేసినట్లు అవుతుందన్న ఉద్దేశంతో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఒప్పందంలోని అనేక కీలక విషయాలు బ యటకు వస్తున్నాయి. ఓ ఐఏఎస్ అధికారికి ఈ విషయంలో నోటీసులు జారీ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
గత ఏడాది ఫిబ్రవరి 11న జరిగిన ఫార్ములా కార్ రేస్ నిర్వహణ, ఏర్పాట్లకు ప్రమోటర్ గా ఓ సంస్థ ముందుకొచ్చింది. ట్రాక్ నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5 కోట్ల వరకు అప్పటి ప్రభుత్వం భరించింది. మిగతాది ప్రమోటర్ సంస్థనే చూసుకుంది. అయితే, ఈ ఫిబ్రవరి 10 నాటి రేస్‌కు ఏ సంస్థా ముందుకు రాలేదు. ట్రాక్, రేసింగ్ నిర్వహణ, ఇతర ఏర్పాట్లు, మార్కెటింగ్, వివిధ దేశాల రేసర్లకు సౌకర్యాల కల్పన అన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకు రూ.200 కోట్లు అవుతుందని అంచనా. దీనికోసం హెచ్ఎండీఏ గత సర్కారు ఆదేశాలతో ఓ నిర్మాణ సంస్థకు రూ.50 కోట్ల వరకు చెల్లించింది.
గత ప్రభుత్వం చెల్లించినది పోగా.. ఫార్ములా రేస్ నిర్వహణకు రూ.150 కోట్లను ప్రస్తుత సర్కారు భరించాల్సి ఉంటుంది. రేస్ జరిగే సమయంలో హుస్సేన్‌సాగర్ స్ట్రీట్ సర్క్యూట్ పేరుతో ఎన్టీఆర్ గార్డెన్ చుట్టూరా 2.7 కిలోమీటర్ల ట్రాక్, అందులో రేస్‌తో పరిసర ప్రాంతాల్లో వారం పాటు ట్రాఫిక్ ఆంక్షలుంటాయి. గత ఏడాది పోటీల సందర్భంగా ప్రజల నుంచి పెద్దఎత్తున విమ ర్శలు వచ్చాయి. నగరం నడిబొడ్డున పోటీలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఈ రేస్ రద్దుపై ప్రజల్లో వ్యతిరేకత లేదు.. ఇలాంటి రేసులు ఔటర్ మీద నిర్వహించుకుంటే బాగుంటుంది. . కానీ ప్రైవేటు సంస్థలు నిర్వహించే రేసులకు ప్రభుత్వానికి మేలు జరగాలి కనీ.. ప్రభుత్వమే వందలకోట్లు ప్రజాధనం వెచ్చించడం ఏమిటన్న ప్రశ్న సహజంగానే వస్తోంది.