నగరం నడిబొడ్డున ఒక వ్యక్తి నీటిలో కొట్టుకుపోయి చనిపోయాడు. మరొక చోట ఇదే నగరంలో ఒక కూలి రోడ్డుమీద నీటిలో నడుచుకుంటూ ఇంటికి వెళ్లబోయి, నడిరోడ్డులో వరద నీటిలో పాస్ అవుతున్న కరెంటు తో షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో బర్రెలు వరద నీటిలో కొట్టుకొని చనిపోయాయి. సముద్ర తీరం లేని hinterland నగరం ఆయన హైదరాబాదులో అపార్ట్మెంట్లలో బేస్మెంట్లు మునిగిపోయి మొదటి ఫ్లోర్, 2వ ఫ్లోర్ వరకు నీళ్ళు వస్తే, జనాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఈ వార్తలన్నీ వందేళ్ల క్రితం జరిగినవో, బ్రిటిష్ పాలనలో స్వాతంత్రం రాక ముందు జరిగినవో కావు. విశ్వనగరం హైదరాబాద్ అని పాలకులు డంబాలు పలికే భాగ్యనగరంలో 2020 వ సంవత్సరంలో కనిపిస్తున్న దృశ్యాలు. ఈ నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ లో తెలంగాణ ప్రభుత్వం ఘోరాతి ఘోరంగా విఫలం చెందిందనే అభిప్రాయాలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి. విదేశీ కాన్ఫరెన్స్ లకి వెళ్లి నపుడల్లా హైదరాబాద్ ని ప్రపంచంలోనే మేటి నగరాలతో పోలిస్తూ, భారతదేశంలోని ఇతర నగరాల కంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ లో తాము చాలా గొప్పగా పని చేస్తున్నామని చెప్పుకునే తెలంగాణ పాలకులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటూ ప్రజల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
అయితే తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి మన మీడియా సంస్థలకు బహుశా ధైర్యం సరిపోతున్నట్లే లేదు. ఇది ఎవరి పాపం, గత పాలకుల నిర్లక్ష్యం పాలు ఎంత అంటూ గతంలో పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెపం వేయడానికి కొన్ని అగ్ర చానల్స్ నిస్సిగ్గుగా ప్రయత్నిస్తున్నాయి. గత ఏడేళ్లుగా అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించడానికి ధైర్యం చాలక పోవడం వల్లో, లేక అధికార పార్టీ ని ప్రశ్నించకూడదు అని నియమం పెట్టుకోవడం వల్లో దాదాపు మీడియా సంస్థలన్నీ తెలంగాణ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనకుండా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఒకవేళ మరీ ఎవరిని అనకపోతే బాగోదు అనుకున్న కొన్ని చానల్స్ మాత్రం, జిహెచ్ఎంసి ని తిడుతూ, తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజలను డైవర్ట్ చేస్తూ కథనాలను వండి మారుస్తున్నాయి.
ఏదేమైనా ఆమధ్య చెన్నై ముంబై బెంగళూరు తదితర ప్రాంతాలలో వరదలు వచ్చినప్పుడు కేటీఆర్ మాట్లాడుతూ ఆయా ప్రాంతాలకు తామే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధిత సహాయం చేశామని, ఆ మూడు నగరాలకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ లో తాము గొప్ప గా పని చేస్తూ ఉన్నామని వ్యాఖ్యలు చేసిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన మాట్లాడిన మాటలకు ప్రస్తుత దృశ్యాలను జత చేస్తూ నెటిజన్లు డిజాస్టర్ మేనేజ్మెంట్లో ప్రభుత్వం పనితీరును ఎండ గడుతున్నారు.
కనీసం ఇప్పుడైనా తెలంగాణ ప్రభుత్వం మరింత పటిష్టమైన చర్యలు తీసుకుని వరదలు చిక్కుకున్న ప్రజలను ఆదుకోవాలని ప్రజలు భావిస్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా మౌలిక వసతుల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు .